చంద్రబాబు, లోకేష్ టీంకు షాక్: పోస్టింగ్ లు ఇవ్వని జగన్

By Nagaraju penumalaFirst Published Jun 4, 2019, 9:16 PM IST
Highlights

బదిలీలన్నీ చాలా వ్యూహాత్మకంగా చేశారని ప్రచారం జరుగుతుంది. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ పేషీల్లో, వారి శాఖల్లో పనిచేసిన వారిలో అత్యధిక శాతం ఐఏఎస్ లకు పోస్టింగ్ లు దక్కలేదు. గతంలోనే చంద్రబాబు నాయుడు పేషీల్లో పనిచేసిన సతీష్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్ లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై పట్టు సాధించే పనిలో పడ్డారు. ఇప్పటికే అన్ని శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ పూర్తి సమాచారం అందుకున్న వైయస్ జగన్ వ్యవస్థలను ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మార్కు పాలన అందించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా దాదాపు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఒకేసారి 36 మంది ఐఏఎస్, అధికారులపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. అయితే ఈ బదిలీలలో సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఎలాంటి పోస్టింగులు ఇవ్వకపోవడం విశేషం. 

బదిలీలన్నీ చాలా వ్యూహాత్మకంగా చేశారని ప్రచారం జరుగుతుంది. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ పేషీల్లో, వారి శాఖల్లో పనిచేసిన వారిలో అత్యధిక శాతం ఐఏఎస్ లకు పోస్టింగ్ లు దక్కలేదు. 

గతంలోనే చంద్రబాబు నాయుడు పేషీల్లో పనిచేసిన సతీష్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్ లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.  అయితే నేడు విడుదలైన ఉత్తర్వుల్లో వారికి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందేమోనని ఆశగా ఎదురుచూశారు. 

అయితే గతంలో చంద్రబాబు పేషీలో పనిచేసిన గిరిజా శంకర్ కుమాత్రమే పోస్టింగ్ దక్కింది మిగిలిన సతీష్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళిలకు ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వని పరిస్థితి. అలాగే సీఆర్డీఏలో పనిచేసిన వారికి కూడా పోస్టింగ్ లు ఇవ్వలేదు. సీఆర్డీఏ కమిషనర్ గా పనిచేసిన శ్రీధర్ ను కూడా జీఏడీకి అటాచ్ చేశారు. 

వీరేకాదు ట్రాన్స్ కో, జెన్ కోలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులైన అజయ్ జైన్, విజయానంద్ లకు సైతం ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వలేదు ఏపీ సర్కార్. అలాగే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా ఉన్న అనురాధకు సైతం పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి అటాచ్ చేసింది. ఆమె స్థానంలో కిషోర్ కుమార్ ను హోంశాఖ సెక్రటరీగా నియమించింది.

వీరితోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులైన కార్తీకేయ మిశ్రా, ఉదయలక్ష్మీ, శశిభూషణ్, కన్నబాబు, రంజిత్ బాషాలకు సైతం ఎలాంటి పోస్ట్ లు ఇవ్వలేదు. వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. 

పరిపాలన యంత్రాంగాన్ని ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేశారు. అందులో భాగంగా దాదాపు 50మంది ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థాన చలనం కల్పించారు. జిల్లాలకు సంబంధించి తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నాలుగు జిల్లాల కలెక్టర్లపై ఎలాంటి వేటు వేయలేదు. 

మెుత్తానికి ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చాలా కసరత్తు చేశారని తెలుస్తోంది. మూడు రోజులుగా కసరత్తు చేసిన అనంతరం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. అయితే అత్యధికంగా 10 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా జీఏడీకి అటాచ్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

ఈ వార్తలను కూడా చదవండి

ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ

ఏపీలో బదిలీ అయిన ఐఏఎస్, ఐపీఎస్ ల జాబితా ఇదే...


 

click me!