బాబు 'భ్రమరావతి'పై ఈనాడులో బాహుబలి సెట్టింగులు: జగన్

First Published Jul 28, 2018, 6:22 PM IST
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

జగ్గంపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి కాదు, భ్రమరావతి అని ఆయన వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన శనివారం సాయంత్రం మాట్లాడారు.

అమరావతిపై ఈనాడు దినపత్రికలో బాహుబలి సెట్టింగులు కనిపిస్తాయని ఆయన అన్నారు. జపాన్, సింగపూర్ భవనాలను చూపించి అమరావతి నిర్మాణం గురించి కథనాలు వస్తాయని ఆయన అన్నారు. అమరావతి రాజసం ఎలా ఉందంటే ఉద్యోగులు పది, పదిహేను నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్తారట అని అని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు పథకాలపై, చంద్రబాబు కార్యక్రమాలపై ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను, వార్తాకథనాలను ఆయన దుయ్యబట్టారు. ఆస్పత్రులను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పినట్లు ఈనాడు దినపత్రిక రాసిందని, అయితే మనం జగ్గంపేట ఆస్పత్రినే చూస్తున్నామని, రెండు అంబులెన్స్ లుంటే ఒక్కటి కూడా పనిచేయదని ఆయన అన్నారు. ఆస్పత్రుల్లో చంటిపిల్లలను ఎలుకలు కొరుకుతుంటాయని అన్నారు.  ఆస్పత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదని అన్నారు. దాంతో సెల్ ఫోన్లు, టార్చిలైట్లు పెట్టుకుని ఆపరేషన్లు చేసే పరిస్థితి ఉందని అన్నారు. 

హేతుబద్దీకరణ పేరు మీద ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు మూసేస్తున్నారని అంటూ నారాయణ, శ్రీచైతన్యలకు స్కూళ్లను చంద్రబాబు విక్రయించారని అన్నారు. అక్కడ ఫీజులు బాదుడే బాదుడని అన్నారు. కరెంట్ చార్జీలు పెరిగాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడని అన్నారు. పక్కనే ఉన్న యానాంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ఆరేడు రూపాయలు తక్కువగా ఉంటుందని అన్నారు. 

click me!