
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతలు పాల్గొన్నారు. తొలుత సీఎం వైఎస్ జగన్.. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు.
దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్ నామ సంవత్సరం పేరుకు తగ్గట్లుగానే ఈ ఏడాది అన్నీ శుభాలే జరుగతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని తెలిపారు.ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. శుభకృత్‌కు తగ్గట్లే పాలన అందిస్తారని సీఎం జగన్‌ను సిద్దాంతి ఆశీర్వదించారు. అనంతరం పంచాంగకర్తను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు.
శారదాపీఠం తరఫున సీఎం వైయస్ జగన్‌కు సిద్ధాంతి వస్త్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు తిలకించారు. నవరత్నాలకు సంబంధించి కూచిపూడి నృత్యాలు చేసిన చిన్నారులను సీఎం జగన్ సత్కరించారు. ఈ సందర్భంగా గంప జయశ్రీ రెడ్డి రచించిన ‘ఆమెకు తోడుగా న్యాయ దేవత పుస్తకాన్ని సీఎం జగన్ దంపతులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు వైసీపీ ప్రభుత్వానికి ఇంకా బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు.
ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.