లక్షకు 15 శాతం వడ్డీ .. కోటీశ్వరులను చేస్తామని రూ.13 కోట్లకు కుచ్చుటోపీ, బెజవాడలో ఘరానా మోసం

By Siva Kodati  |  First Published Apr 1, 2022, 9:13 PM IST

షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో  కరెన్సీ పేరుతో ఇటీవలి కాలంలో మోసాలు ఎక్కువ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలో ఇదే తరహా మోసం వెలుగుచూసింది. కోటీశ్వరులను చేస్తామని చెప్పి రూ.13 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిందో సంస్థ.


విజయవాడలో (vijayawada) షేర్ మార్కెట్ (share market) పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి ఏపీ వ్యాప్తంగా కోట్లు వసూలు చేసింది ఏఎన్‌వీఎస్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీ దగ్గర డబ్బులుంటే చాలు.. మేం కోటీశ్వరుల్ని చేస్తామంటూ అమాయకులకు వల వేసిన సంస్థ లాభానష్టాలతో సంబంధం లేకుండా లక్షకు 15 శాతం వడ్డీ ఇస్తామంటూ బాధితులకు కుచ్చుటోపీ పెట్టింది. దీంతో ఆశపడి చాలా మంది డబ్బులు కట్టారు. ఆ డబ్బుతో రాత్రికి రాత్రే ఊడాయించారు సంస్థ నిర్వాహకులు. లాభాలు ఇస్తామంటూ రూ.13 కోట్లతో పారిపోయారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వారం క్రితం పెనమలూరు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 420 కింద నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 30 మంది బాధితులు బయటకు వచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో Crypto Currencyలో పెట్టుబడి పెడితే రూ. కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ. కోటికి పైగా కొట్టేశారు. City Cybercrime ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కవాడిగూడకు చెందిన శ్రీనివాస్ ను ఇటీవల ఓ వ్యక్తి Telegram Group లో యాడ్ చేశాడు. సదరు గ్రూప్ లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుందేది. 

Latest Videos

undefined

కొద్ది రోజుల తరువాత శ్రీనివాస్ తో మాటలు కలిపిన సైబర్ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్’ అనే యాప్ ను శ్రీనివాస్ మొబైల్లో డౌన్ లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73 లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73 లక్షలకు గాను అతడి సైట్ లో ఇతని పేరుపై రూ.4 కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్ అతడిని నిలదీశాడు. 

మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ. కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబర్ పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 2న కూడా ఇలాంటి మోసమే జనగామ లో జరిగింది. క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం  జరిగింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో తమను మోసం చేసినట్లు 300 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే  భారీగా లాభాలు వస్తాయని జనగామ జిల్లా పామనూరు గ్రామానికి చెందిన పల్నాటి నవీన్ చాలా మందిని నమ్మించాడు. ముందుగా లక్షా 70 వేల చొప్పున చెల్లిస్తే వారానికి 13 వేల చొప్పున .. 52 వారాలతో పాటు డబ్బు వస్తుందని నమ్మించాడు నవీన్. 

దీంతో అతని మాటలు నమ్మిన చాలామంది అతనికి డబ్బు చెల్లించారు. అయితే డబ్బు కట్టిన వాళ్లలో కొందరికి మొదట డబ్బులు వచ్చాయని.. తర్వాత రావడం ఆగిపోయాయంటున్నారు బాధితులు. దీంతో నవీన్‌ను ప్రశ్నించగా.. ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బీకి మారిందని కట్టుకథలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నాడు. డబ్బంతా ఆన్‌లైన్‌లో కట్టేశానని.. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని నవీన్ చెబుతున్నాడంటున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

click me!