
ట్రైన్ లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయిలెట్ కు వెళ్లిన ఓ మహిళ తీవ్ర ఇబ్బందికి గురైంది. రెండు గంటల పాటు అందులో నుంచి బయటకు రాలేకపోయింది. దీంతో ట్రైన్ లో ఉన్న అందరూ ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు సిబ్బంది ఎంతో ప్రయత్నించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
యశ్వంత్ పురా నుంచి హావ్ డా వెళ్తున్న ట్రెయిన్ లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆ కోచ్ లో ఉన్న టాయిలెట్ కు వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకున్నారు. అయితే తరువాత దానిని తీయడానికి ఆమె ప్రయత్నిస్తుంటే డోరు ఓపెన్ కాలేదు. దీంతో ఆమె సంబంధీకులు తీవ్ర ఆందోళన చెందారు. లోపలే చిక్కుకుపోవడంతో ఆమె కూడా టెన్షన్ పడ్డారు. ఆ ట్రైన్ డోరు ఓపెన్ చేయడానికి అక్కడ సిబ్బంది ఎవరూ లేరు. దీంతో తరువాత వచ్చే పలాస స్టేషన్ కు ఆమె సంబంధీకులు సమాచారం అందజేశారు.
పలాసకు చేరుకున్న తరువాత అక్కడి సిబ్బంది ఆ ట్రైన్ లోకి ప్రవేశించారు. క్యారేజ్ అండ్ వ్యాగన్ మెకానికల్ సిబ్బంది ఆ టాయిలెట్ తలుపును పగులగొట్టారు. అనంతరం అందులో ఉన్న ప్రయాణికురాలిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారుగా రెండు గంటల పాటు ఆ మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆమె సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.