జగన్ కు షాక్: భగ్గుమంటున్న ఎమ్మెల్యేలు, రాజీనామాలకు రెడీ

By Pratap Reddy KasulaFirst Published Apr 10, 2022, 11:36 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వైసీపీలో చిచ్చు పెట్టింది. బాలినేనితో సహా పలువురు ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ మీద తిరుగుబాటుకు సిద్ధపడ్డారు.

అమరావతి: తిరుగులేని నాయకుడుగా పేరు గాంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అసమ్మతి సెగ తగులుతోంది. ఊహించని రీతిలో వైసీపీ ఎమ్మెల్యేలో అసమ్మతి భగ్గుమంటోంది. వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సాఫీగా సాగుతుందని, తిరుగుబాటు చేయడానికి ఎవరు కూడా సాహిసించరని అనుకున్నారు. కానీ, తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలకు అసంతృప్తులకు దిగుతున్నారు. బుజ్జగింపులు కూడా పనిచేయడం లేదు. 

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తనకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారనని, ఎవరితోనూ మాట్లాడే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము దీక్షలు చేస్తామని, ఆందోళనలకు దిగుతామని వారు చెబుతున్నారు.

వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. పలు దఫాలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. బాలినేని అనుచరులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ఉన్నారనే వచ్చినట్లు ఆయన చెప్పారు. 

ఉదయభాను అనుచరులు జగ్గయపేటలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఉదయభాను నివాసం వద్ద ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాము రేపు సమావేశమవుతున్నామని వైసీపీకి రాజీనామాలు చేస్తామని ఉదయభాను అనుచరులు చెప్పారు. ఉదయభాను నివాసం వద్ద వారు ఆందోళనకు దిగారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందన భావించిన ఆయన పదవి దక్కకపోవడంతో తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఇది గమనించి వైఎస్ జగన్ తన కార్యదర్శి ధనంజయ్ రెడ్డితో ఫోన్ చేశారు. దాంతో తీవ్రమైన వ్యాఖ్య చేస్తూ పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి ఫోన్ కట్ చేశారు. 

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా తమ మంత్రి పదవి ఆశించారు. మంత్రి వర్గం జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. తమ పదవులకు రాజీనామాలు చేస్తామని వారు అంటున్నారు. కొత్త మంత్రుల జాబితా నుంచి పార్థసారథి పేరును చివరి నిమిషంలో తొలగించారు. ఆయనకు కాకుండా యాదవ సామాజిక వర్గం నుంచి మరో ఎమ్మెల్యేకు చోటు కల్పించారు. దీంతో పార్థసారథి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసారు. జగన్ తనను అనర్హరుడని అనుకుని ఉండవచ్చునని ఆయన అన్నారు. 

శిల్పా చక్రపాణి రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. దీంతో ఆత్మకూరు చైర్ పర్సన్ తో సహా కౌన్సిలర్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిది మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. ఆయన అనుచరులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. ఆయన అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య వర్గాలకు మంత్రి పదవులు దక్కలేదు. తాజా మాజీ మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. 

తాజా మాజీ మంత్రి మేకతోటి సుచరిత తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. తన ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేశారు. మోపిదెవి వెంకటరమణకు తన రాజీనామా లేఖను అందజేశారు. మేకతోటి సుచరితతో చర్చలకు వచ్చిన మోపిదేవిని అడ్డుకోవడానికి మేకతోటి సుచరిత అనుచరులు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో మోపిదేవి వెళ్లిపోయారు. 

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాబాబు రావు కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. రేపు ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

click me!