
ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. మిగిలిన దళితులను అలాగే కొనసాగించి తనకు ఒక్కదాన్నే తొలగించడం ఏమిటని ఆమె ఇప్పటికే తన అసంతృప్తిని బయటపెట్టారు. ఆమెను బుజ్జగించడానికి వచ్చిన మోపిదేవికి తమ రాజీనామాను సమర్పించారు. పార్టీ సభ్యత్వానికి కాకుండా తన ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేసినట్టు ఆమె కూతురు రిషిక మీడియాకి వెల్లడించారు.
ఆమె అభిమానులు ఆమె నివాసం వద్దకు చేరుకొని నిరసన తెలపడమే కాకుండా మోపిదేవి కాన్వాయ్ కి అడ్డంగా పడుకున్నారు. చివరకు పోలీసుల సహాయంతో ఆయన అక్కడి నుండి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గ ఏర్పాటు మంటలను రాజేస్తోంది. తాజా మాజీలు, మంత్రి పదవిని ఆశించిన వారు తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. పలుచోట్ల వారి అభిమానులు దిష్టిబొమ్మల దహనం దగ్గరినుండి రోడ్డు పై బైఠాయించడం వరకు అనేక విధాలుగా తమ నిరసనను తెలుపుతున్నారు.
మరోవైపు , ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. బాలినేనితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చలు జరిపారు. బుజ్జగించడానికి ప్రయత్నించారు. అయితే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన మనసు మార్చుకోలేదు. ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో తన రాజీనామా ప్రకటించడానికి ఇంట్లోంచి బయటకు వస్తున్న తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. బాలినేనిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి చర్చలు జరిపారు. వారితో పాటు కరణం బలరాం తదితర నాయకులు కూడా ఉన్నారు.
బంధుత్వం పేరు చెప్పి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సరైంది కాదని బాలినేని అంటున్నారు. అదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్ కు తిరిగి మంత్రి పదవి ఇవ్వడానికి జగన్ సిద్ధపడడం బాలినేనిని మరింతగా మనస్తాపానికి గురి చేసింది. దాంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు. రాజకీయాల నుంచి తప్పుకోనుననట్లు ప్రకటించడానికి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నుండి మొదలు పేర్ని నాని వరకు చాలా మంది అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. మొత్తంగా ఈ కాబినెట్ మార్పు కొత్త తలనొప్పులు తీసికొచ్చి పెడుతుంది.