YS jagan cabinet reshuffle: రాజీనామాకు బాలినేని రెడీ, మేయర్ సహా కార్పోరేటర్లు

By Pratap Reddy KasulaFirst Published Apr 10, 2022, 10:59 PM IST
Highlights

తాజా మాజీ మంత్రి బాలినెని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. తన రాజీనామా విషయాన్ని ప్రకటించే సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయనను ఇంట్లోకి తీసుకుని వెళ్లారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఎమ్మెల్యేల్లో తీవ్రమైన అసంతృప్తి రగులుతోంది. తాజా మాజీ మంత్రులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. మేకతోటి సుచరిత తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తన రాజీనామా లేఖను ఆమె రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందజేసినట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని రేపు సోమవారం పున్ర్వస్థీకరణ చేపడుతున్న విషయం తెలిసిందే. కొత్త మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ స్థితిలో జగన్ కు అసమ్మతి సెగ తగులుతోంది. 

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. బాలినేనితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చలు జరిపారు. బుజ్జగించడానికి ప్రయత్నించారు. అయితే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన మనసు మార్చుకోలేదు. ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో తన రాజీనామా ప్రకటించడానికి ఇంట్లోంచి బయటకు వస్తున్న తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. బాలినేనిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి చర్చలు జరిపారు. వారితో పాటు కరణం బలరాం తదితర నాయకులు కూడా ఉన్నారు. 

బంధుత్వం పేరు చెప్పి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సరైంది కాదని బాలినేని అంటున్నారు. అదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్ కు తిరిగి మంత్రి పదవి ఇవ్వడానికి జగన్ సిద్ధపడడం బాలినేనిని మరింతగా మనస్తాపానికి గురి చేసింది. దాంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు. రాజకీయాల నుంచి తప్పుకోనుననట్లు ప్రకటించడానికి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు

బాలినేనికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మేయర్ తో సహా కార్పోరేటర్లు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. బాలినేని అనుచరులు ఆందోళకు దిగారు. మంత్రి పదవి విషయంలో తనను నమ్మించి మోసం చేశారని బాలినేని అంటున్నారు. సజ్జల, శ్రీకాంత్ రెడ్డి దాదాపు గంటన్నర సేపు బాలినేనితో చర్చలు జరిపారు. అయితే, ఫలితం కనిపించినట్లు లేదు. సజ్జలకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వైఎస్ జగన్ దిష్టిబొమ్మను బాలినేని అనచరులు దగ్ధం చేశారు.

బాలినేనితో మాట్లాడడానికి వచ్చామని, అంతకు మించి ఏమీ లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో భేటీ తర్వాత అన్నారు.కాగా, రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. 

మరో ఎమ్మెల్యే పార్థసారథి కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన అసమర్థతను గుర్తించి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారని, వైఎస్ జగన్ ఇవ్వలేదని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అసంత-ప్తి వ్యక్తం చేశారు. 

click me!