కృష్ణదాస్ కు ప్రమోషన్: జగన్ కొలువులో కొత్త మంత్రలు వీరే, శాఖలు ఇవే....

By telugu teamFirst Published Jul 22, 2020, 8:10 AM IST
Highlights

అనూహ్యంగా ధర్మాన కృష్ణదాస్ కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ప్రమోషన్ లభించనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ అవుతున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జగన్ మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు ఈ రోజే చేరనున్నారు. కొత్త మంత్రులు ఎవరనేది ఖరారైపోయింది. ఈ రోజు బుధవారం మధ్యాహ్నం 1.29 గంటలకు వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజుల చేత గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే హాజరు కానున్నారు. మంత్రిపదవులకు రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకరమణ స్థానాల్లో ఆ సామాజిక వర్గాలకు చెందిన వేణు, అప్పలరాజులకే మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

ఇదిలావుంటే, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వనున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ వచ్చారు. రెవెన్యూ శాఖను ధర్మాన కృష్ణదాస్ కు అప్పగించాలని నిర్ణయించారు. వేణుకు రోడ్లు, భవనాల శాఖ, అప్పలరాజుకు మత్స్య శాఖను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేణు, అప్పలరాజులకు, ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే కృష్ణదాస్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారంనాడు తేనేటి విందు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు రెవెన్యూ శాఖను అప్పగించడంలోని ఆంతర్యాన్ని జగన్ కృష్ణదాస్ కు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు 1980లో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ అనే మత్స్యకార కుటుంబంలో జన్మించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ సాధించారు. ఆంధ్య విశ్వవిద్యాలయంలో జనరల్ మెడిసిన్ లో ఎండీ చదువుకున్నారు. ఆ తర్వాత కెజిహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 2007లో పలాస- కాశిబుగ్గలో సేఫ్ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి పలాస నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి విజయం సాధించారు. 

తూర్పు గోదావరి జిల్లా రామచందర్పారుం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అనూహ్యంగా 2001లో కాంగ్రెసు ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019లో రామచంద్రపురం నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 

click me!