బాలకృష్ణ చిన్నల్లుడికి జగన్ ఝలక్: బొత్స తెచ్చిన తంటా

By Nagaraju penumalaFirst Published Oct 30, 2019, 5:23 PM IST
Highlights

గత కొంతకాలంగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ కు సంబంధించి రుణాలు చెల్లించకపోవడంతో భూముల స్వాధీనం కోసం ఆంధ్రాబ్యాంక్ నోటీసులు పంపగా తాజాగా ప్రభుత్వం 498 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయడం మరో దెబ్బ అని చెప్పుకోవాలి. 

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు గట్టి షాక్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ తండ్రికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ తీర్మానించింది. 

బాలకృష్ణ రెండో వియ్యంకుడికి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద గీతం యూనివర్ఇటీ కోసం 498 ఎకరాల భూమిని కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.  

బాలకృష్ణ వియ్యంకుడికి కేటాయించిన భూములతో పాటు విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కోసం లులు గ్రూప్‌కు కేటాయించిన రూ.1500 కోట్లు విలువ చేసే 13.83 ఎకరాల భూ కేటాయింపులను కూడా జగన్ కేబినెట్ రద్దు చేసింది. 

ఇకపోతే బాలకృష్ణ రెండో వియ్యంకుడికి జగ్గయ్యపేటలో చంద్రబాబు ప్రభుత్వం భారీ ఎత్తున భూములు కట్టబెట్టిందంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  

రాజధాని భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన వైనంలో అది కూడా ఒకటి అంటూ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలో రాజధాని వస్తుందని అధికారికంగా ప్రకటించకు ముందే బాలకృష్ణ వియ్యంకుడు రామారావుకు భారీగా భూ కేటాయింపులు జరిగాయని ఆరోపించారు. 

493 ఎకరాల భూమిని ఎకరానికి లక్ష రూపాయలకే కారు చౌకగా కేటాయించారని ఆరోపించారు. ఏపీఐఐసీ ద్వారా అంత కారు చౌకగా ఆ భూమిని కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత అదే భూమిని సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. 

రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందని అధికారికంగా ప్రకటించక ముందే బాలకృష్ణ వియ్యంకుడికి లబ్ధి కలిగించేలా ఆ తర్వాత రాజధానిని ప్రకటించి దాన్ని సీఆర్డీఏ పరిధిలోకి వచ్చేలా చేశారని ఇదంతా ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా అంటూ  బొత్స ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలపై బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ స్పందించారు కూడా. తమకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ భూములు లీజుకు ఇచ్చారని కొన్ని పత్రాలు చూపించారు. 

శ్రీభరత్ ఇచ్చిన సమాధానానికి సైతం బొత్స కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడి హయాంలో వచ్చిన మరికొన్ని జీవోలను మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. ఇదంతా రాజధాని భూముల్లో స్కామ్ అంటూ కీలక ఆరోపణలు చేశారు. 
 
మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. దాంతో సుజనాచౌదరి కూడా స్పందించాల్సి వచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ హితవు పలికారు. 

గత కొంతకాలంగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ కు సంబంధించి రుణాలు చెల్లించకపోవడంతో భూముల స్వాధీనం కోసం ఆంధ్రాబ్యాంక్ నోటీసులు పంపగా తాజాగా ప్రభుత్వం 498 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయడం మరో దెబ్బ అని చెప్పుకోవాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు ఫ్యామిలీలో టెన్షన్: హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్, ఆస్తులు స్వాధీనం

ప్రజల సొమ్ము దోచుకోవడం కాదు...నా సొమ్మే ప్రభుత్వం...: శ్రీభరత్
 
 

click me!