ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.. నేడు ఒకే వేదికపైకి సీఎం జగన్, చంద్రబాబు

By Sumanth KanukulaFirst Published Dec 5, 2022, 9:25 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు నేడు వేర్వేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించే అఖిలపక్ష  సమావేశంలో వీరు పాల్గొననున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  నాయుడు నేడు వేర్వేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. 2023లో జీ20 సదస్సును భారత్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. జీ20 సన్నాహక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా నాయకుల నుంచి ప్రధాని మోదీ సూచనలను స్వీకరించనున్నారు. అలాగే జీ20 అధ్యక్ష పదవి లక్ష్యాలపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో వివరించనున్నారు. 

ఈ క్రమంలోనే కేంద్రం నుంచి ఆహ్వానం మేరకు వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు సమావేశంలో పాల్గొనేందుకు వేర్వేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే సీఎం జగన్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే తిరుగుపయనమవుతారు. రాత్రి 10.30 గంటల సమయంలో సీఎం జగన్ విజయవాడ చేరుకుంటారు. సీఎం జగన్ మంగళవారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. 

ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిన్‌పోర్టు నుంచి ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ బయలుదేరి  వెళతారు. మధ్యాహ్నం 12.40 గంటలకు  చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. 

అయితే  ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే సమావేశానికి జగన్, చంద్రబాబులు హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్దం వ్యక్తిగత దూషణల వరకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో జరుగుతున్న సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొనబోతుండటంతో.. వారిద్దరు ఎదురుపడితే పలకరించుకుంటారా? లేదా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

click me!