తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినా ఇప్పటికీ అనేక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఇరు రాష్ట్రాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏయే అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారంటే....
తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎదురుచూసిన ఆ క్షణాలు రానేవచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అపరిష్కృత సమస్యలు చర్చకు వచ్చాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అనగాని సత్య ప్రసాద్, కందుల దుర్గేష్, జనార్దన్ రెడ్డి, ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులతో కలిసి హైదరాబాద్‌లో సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది’ అని తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తెలంగాణ ఇబ్బందులు పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కూ ఇది సమస్యగానే ఉందన్నారు. ఆయా అంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. చర్చల ద్వారా రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు.
ఈ భేటీ అనంతరం ఇరు రాష్రాల మంత్రులు ఉమ్మడిగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. పలు అంశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్.. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై లోతుగా చర్చించినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన చర్చించుకోవాలని, పరిష్కరించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఒక్క సమావేశంలోనే పరిష్కారం వస్తుందని తాము అనుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. సీఎస్‌లతో పాటు ముగ్గురు అధికారులతో కమిటీ ఉంటుందని తెలిపారు. రెండు వారాల్లో సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే, అధికారుల కమిటీలో పరిష్కారం కానీ అంశాల కోసం మంత్రుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అక్కడ కూడా వీలుకాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చిస్తామన్నారు.
‘అదేవిధంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ క్రైమ్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఇది తెలుగు జాతి హర్షించే రోజన్నారు. ‘విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని ఇద్దరు సీఎంలు చెప్పారు. ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. డ్రగ్స్ మహమ్మారి సమస్యలను ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు’ అని వెల్లడించారు.
చర్చకు వచ్చిన మరికొన్ని అంశాలు...
ప్రజాభవన్‌లో దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. అధికారుల సూచనలు కూడా తీసుకున్నారు.
విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఉమ్మడి ఆస్తుల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు, ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
అలాగే, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అధికారులు... ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని తెలిపారు.
మరోవైపు, హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు కావాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు కోరగా.. తెలంగాణ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరాస్తులు ఇచ్చే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ తరఫున దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయిస్తామన్నారు.