నాపై వచ్చిన ఆరోపణలను జీర్ణించుకోలేకపోతున్నాను.. నిజం తేలాలని కోరుకుంటున్నా: అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Sumanth KanukulaFirst Published Jan 24, 2023, 12:24 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వైసీపీ  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పందించిన అవినాష్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు వైసీపీ  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పందించిన అవినాష్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్లుగా తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తాను ఎలాంటివాడినో జిల్లా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. న్యాయం గెలవాలని.. నిజం తేలాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించాలని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో కుటుంబాలు ఎలా ఫీలవుతాయో ఊహించుకోండి అంటూ మండిపడ్డారు. 

సీబీఐ నోటీసులు గురించి ప్రస్తావిస్తూ.. నిన్న మధ్యాహ్నం నోటీసు ఇచ్చిన ఈరోజు  మధ్యాహ్నం రమ్మంటే ఎలా అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. తనకు నాలుగు రోజుల  పాటు కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. అందుకే సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరానని చెప్పారు. మళ్లీ నోటీసులు ఇస్తే.. అప్పుడు విచారణకు హాజరవుతానని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. ఈరోజు కూడా సీబీఐ అధికారులు మరోసారి పులివెందులకు చేరుకన్నారు. పులివెందులలో పలు ప్రాంతాలను సీబీఐ అధికారులు పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సీబీఐ విచారణకు గడువు కోరిన అవినాష్ రెడ్డి.. ఈ రోజు షెడ్యూల్డ్ చేయబడిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డికి నోటీసులు జారీచేశారు. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డికి నోటీసులు అందజేశారు. అవినాష్ రెడ్డి.. మంగళవారం(జనవరి 24) హైదరాబాద్‌లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

అయితే సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలుసుకున్న అవినాష్‌ రెడ్డి.. మంగళవారం విచారణకు హాజరుకాలేనని అధికారులకు సమాచారం అందజేసినట్టుగా  తెలుస్తోంది. ముందస్తు నిర్ణయించిన కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉన్నందువల్ల.. తాను హాజరుకాలేకపోతున్నానని  తెలిపారు. సీబీఐ అధికారుల ముందు హాజరుకావాడానికి సమయం కోరిన అవినాష్ రెడ్డి.. ఐదు రోజుల తర్వాత అధికారులు పిలిచిన సమయంలో విచారణకు హాజరుకానున్నట్టుగా చెప్పినట్టుగా సమాచారం. అయితే అవినాష్ రెడ్డి పంపిన సమాచారంపై సీబీఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది.

click me!