వైఎస్ వివేకా కేసు: రెండో భార్య, అల్లుడి పాత్రపై విచారణకు అవినాష్ రెడ్డి అఫిడవిట్

By narsimha lode  |  First Published Mar 13, 2023, 4:15 PM IST


తెలంగాణ హైకోర్టులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  మరో అఫిడవిట్ ను దాఖలు  చేశారు.  



హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసుకు సంబంధించి  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో  అఫిడవిట్  దాఖలు  చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  అతని అల్లుడు, వివేకా రెండో భార్య  పాత్రపై దర్యాప్తు చేయడం లేదని  వైఎస్ అవినాష్ రెడ్డి ఆ అఫిడవిట్ లో  పేర్కొన్నారు. 

తాను దాఖలు  చేసిన పిటిషన్ లో  వైఎస్ సునీతా రెడ్డి ఇంప్లీడ్  పిటిషన్  వేయడం వెనుక  సీబీఐ అధికారుల హస్తం  ఉందని  ఆయన  ఆరోపించారు.  వివేకానందరెడ్డి గుండెపోటుతో  మృతి చెందినట్టుగా తాను ఎక్కడా  కూడా చెప్పలేదని  ఆ ఆఫిడవిట్ లో  అవినాష్ రెడ్డి  పేర్కొన్నారు.  శశికళ అనే మహిళతో  తాను మాట్లాడలేదని  అవినాష్ రెడ్డి స్పష్టం  చేశారు. ఈ నెల  10వ తేదీన  తనను సీబీఐ అధికారులు విచారించిన సమయంలో  గూగుల్ టేకౌట్ గురించి అడిగారని  ఆయన   చెప్పారు. పారదర్శకంగా విచారణ  జరిగితే  తన గూగుల్ టేకౌట్  ఇచ్చేందుకు సిద్దంగా  ఉన్నానని  వైఎస్ అవినాష్ రెడ్డి  ఆఫిడవిట్ లో  పేర్కొన్నారు.

Latest Videos

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు  వరుసగా విచారిస్తున్నారు.ఈ విచారణ  పారదర్శకంగా సాగడం లేదని  వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  తనను లక్ష్యంగా  చేసుకొని  సీబీఐ విచారణ సాగుతుందని  ఆయన  ఆరోపించారు.  ఈ విషయమై  తెలంగాణ హైకోర్టులో ఈ నెల  9వ తేదీన  పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై  విచారణ నిర్వహించిన  హైకోర్టు  తదుపరి తీర్పు వచ్చే వరకు  అవినాస్ రెడ్డిని అరెస్ట్  చేయవద్దని ఆదేశాలు  జారీ చేసింది. 

also read:అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట: అరెస్ట్ చేయవద్దని ఆదేశం

2019  మార్చి  19వ తేదీ  రాత్రి  పులివెందులలో  వైఎస్  వివేకానందరెడ్డిని దుండగులు  అత్యంత దారుణంగా హత్య  చేశారు.  ఈ  హత్య జరిగిన సమయంలో  చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్నారు.   వివేకా హత్య  కేసు విచారణకు  చంద్రబాబు సర్కార్ సిట్ ను  ఏర్పాటు  చేసింది.   ఆ తర్వాత  వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  జగన్ సర్కార్ కూడ  సిట్ ను ఏర్పాటు  చేసింది.  అయితే ఈ కేసును సీబీఐతో  విచారణ  చేయించాలని   దాఖలైన పిటిషన్లపై విచారణ  చేసిన  ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు  ఆదేశించింది.   ఈ కేసులో  ఇప్పటికే  పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు ఈ కేసులో  వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా  పని చేసిన దస్తగిరి  సీబీఐకి అఫ్రూవర్ గా  మారాడు.
 

click me!