
రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కి ఆశల జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువకుడు... అకారణంగా తనువు చాలించాడు. తన పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లి... యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన కడప జిల్లా నందలూరులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు చెందిన కాశి శ్యాం(25) కి ఇటీవల పెళ్లి నిశ్చయం అయ్యింది. ఈ నెల 12వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. కాగా... యువకుడు తన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు పత్రికలు పంచడానికి వెళ్లాడు.
మధ్యాహ్నం సమయంలో నందలూరు ఆల్విన్ కర్మాగార సమీపంలో ముంబై నుంచి చెన్నై వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైలుకింద ప్రమాదవశాత్తు పడటంతో రెండు కాళ్లు తెగిపోయాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగాల్సిన పరిస్థితిలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, బం«ధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసుల దర్యాప్తులో సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.