
తిరుమలలో అపచారాలు జరిగిపోతూనే ఉంది. ఏదో జరిగిపోయిందని కాస్త హడావుడి చేయటం ఆ తర్వాత చల్లబడిపోవటం తిరుమలలో మామూలైపోయింది. టిటిడి అంటే మినీ రాష్ట్ర ప్రభుత్వం లాంటిదే. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నన్ని శాఖలే దాదాపు టిటిడిలో కూడా ఉన్నాయి.
అందులో నిఘా విభాగం, సెక్యూరిటీ విభాగం లాంటివి ప్రధానం. వీటికి ఎస్పీఎఫ్ బలగాలు అదనం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే తాజాగా ప్రధాన ఆలయానికి సమీపంలో ఉన్న అర్చక నిలయం వద్ద కొందరు యువకులు మద్యం తాగటం సచలనంగా మారింది. అది కూడా బహిరంగంగా రోడ్డుపైనే కూర్చుని మరీ మద్యం తాగటం ఆశ్చర్యం.
ఆరుగురు యువకులు రోడ్డుపైనే కూర్చుని మద్యం తాగుతుంటే నిఘా విభాగం, పోలీసులు ఏమి చేస్తున్నారో అర్ధం కావటం లేదు. అసలు ఆ యువకులు తిరుమలపైకి మద్యం ఎలా తేగలిగారో. ఎందుకంటే, తిరుపతిలోని అలిపిరి వద్దే చెక్ పోస్టు ఉంటుంది. ఆ పైన తిరుమల ముఖద్వారం వద్ద ఉన్న మరో చెక్ పోస్టు వద్ద రెండోసారి కూడా తనిఖీ చేస్తారు.
ఇన్ని తనిఖీలను దాటుకుని యువకులు మద్యం సీసాలను ఎలా తెచ్చారో నిఘా విభాగానికే తెలియాలి. భద్రత యావత్తు టిటిడి విజిలెన్స్ తో పాటు ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ఉంటుంది. చెప్పుకోవటానికి ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి.
గతంలో కూడా వ్యభిచారం, మద్యం అమ్మటం, తాగిన ఘటనలున్నాయి. అప్పటికప్పుడు ఏదో కంటితుడుపు చర్యలు తీసుకుంటుండటంతో ఎవరికీ భయం లేకుండా పోయింది. అసలు తిరుమలలో జరుగుతున్న అపచారాలకు ఇఓ, జెఇఓలనే నేరుగా బాధ్యులను చేస్తే గానీ ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడదు.