
బాగా చదివి... కొడుకు ప్రయోజకుడు అవుతాడని.. మంచి ఉద్యోగంలో స్థిరపడి తమను బాగా చూసుకుంటాడని వారెంతో ఆశపడ్డారు. కానీ.. వారి ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. చిన్న మాటకే కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో.. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిపోయింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆమదాలవలస మండలం తురకపేట గ్రామానికి చెందిన మామిడి మురళీ(17) స్థానిక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ఏదో విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నన్నాడు. ఆసరాగా నిలుస్తాడనుకున్న కుమారుడు మృత్యువు ఒడిలోకి చేరడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.