
ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారిన ఓ యువకుడు.. వాటి కారణంగా ఏకంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారి.. మానసిక సమస్యలు కొనితెచ్చుకున్నాడు. అనారోగ్యం పూర్తిగా పాడుచేసుకొని చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖ ఏజెన్సీ పాడేరులోని నీలకంఠంనగర్(చాకలిపేట)లో నివాసముంటున్న ఆర్‌ఎంపీ వైద్యుడు సంకు శంకరరావు కుమారుడు జయకుమార్(19) పబ్జీ గేమ్‌తో పాటు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. వీటి వల్ల గతేడాది మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లి మానసిక నిపుణులతో చికిత్స చేయించారు.
మందులు వాడుతుండడంతో అతని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇటీవల ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన జయకుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జయకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుచోట్ల గాలించినా.. ఆచూకీ లభించలేదు.
సోమవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద బావిలో జయకుమార్ మృతదేహం బయటపడింది. బావి గట్టుపై జయకుమార్ ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాన్ని బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు.