
తిరుపతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ టిడిపిని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను భుజానేసుకున్నాడు. ఇందుకోసం 'యువగళం' పేరిట రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించేందుకు సిద్దమైన లోకేష్ కుప్పం నుండి ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజలతో మరీ ముఖ్యంగా యువతతో మమేకమవుతూ లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే యువతీయువకులతో ప్రత్యేక చిట్ చాట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న లోకేష్ కు తిరుపతిలో ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. గతంతో టిడిపి అధికారంలో వుండగా తిరుమల వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ ను చంద్రబాబు, లోకేష్ కొట్టేసారంటూ వైసిపి ఆరోపణలను గుర్తుచేస్తూ... ఆ పింక్ డైమండ్ లొల్లేంటి అన్న ఓ యువకుడి ప్రశ్నకు లోకేష్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.
''పింక్ డైమండ్ లొల్లి ఏందన్నా... అది మీ దగ్గర వుందా.. వుంటే నాకు ఎప్పుడిస్తారు? నా గర్ల్ ప్రెండ్ కావాలంటోంది'' అంటూ ఓ యువకుడు లోకేష్ ను సరదాగా ప్రశ్నించాడు. లోకేష్ కూడా కాస్త సరదాగా, కాస్త ఘాటుగా సమాధానమిచ్చాడు.
''ఈ పింక్ డైమండ్ లొల్లి ఏంటో నాకు అర్థంకావడం లేదు... నేను వెతుకుతున్నా. వైసిపి నాయకులు మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మేము పింక్ డైమండ్ కొట్టేసామని అన్నారు. లోకేష్, చంద్రబాబు పింక్ డైమంట్ కొట్టేసారన్న వారే ఈ నాలుగేళ్లు అధికారంలో వున్నారు... ఇంతకాలం ఏం పీకారు? అధికారంలో వున్న మీ దగ్గర సిబిసిఐడి వుంది కదా... ఎందుకు విచారణ చేయించలేదు. ఆరోపణలు చేయడం చాలా ఈజీ... వాటిని నిరూపించడమే కష్టం'' అని లోకేష్ అన్నారు.
''వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వెల్లినా గోవిందా... గోవిందా. గతంలో స్వామి జోలికి వచ్చినవారు ఏమయ్యారో చూసినం. ఇన్ని కొండలు కాదు అన్ని కొండలంటే ఏమయ్యిందో తెలుసు కదా...'' అంటూ పరోక్షంగా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణం గురించి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేసారు.
''నేను మంత్రిగా చిత్తశుద్దితో పనిచేసా... ఏ తప్పు చేయలేదు కాబట్టే తిరుపతి నడివీధుల్లో ధైర్యంగా పాదయాత్ర చేస్తున్నా. కానీ నాపై ఆరోపణలు చేసి గెలిచిన వారు మాత్రం భయంతో పరదాలు కట్టుకుని భయంభయంగా బయటకు వస్తున్నారు. ఎవరెక్కడ టమాటాలు, గుడ్లు వేస్తారోనని భయపడుతున్నారు'' అంటూ లోకేష్ అన్నారు.
ఇక చివరగా మళ్ళీ స్వామివారి పింక్ డైమండ్ దొంగతనం ఆరోపణలపై లోకేష్ స్పందించారు. ఈ పింక్ డైమండ్ లొల్లిగురించి ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిని అడిగితే బావుంటుంది... ఆయన ఏం సమాధానం చెబుతారో చూద్దామంటూ ప్రశ్న అడిగిన యువకుడికి లోకేష్ సూచించారు.