
తాడేపల్లి: ప్రాణంగా ప్రేమించిన వాడితో ఎక్కడ పెళ్లికాదోనని ఆ యువతి భయపడిపోయింది. ప్రియుడికి దూరంగా వుండలేక... పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక తీవ్ర మనోవేధనను అనుభవిస్తున్న యువతి చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది. ప్రేమించిన వాడితో కలిసి జీవితాన్ని పంచుకోలేనేమో అన్న భయంతో జీవితాన్నే చాలించాలనుకుంది. ఈ క్రమంలోనే యువతి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నా (girl suicide attempt)నికి పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
విజయవాడ (vijayawada) ప్రసాదంపాడుకు చెందిన యువతి ఓ యువకుడిని ఇష్టపడింది. చాలాకాలంగా ప్రేమించికుంటూ మనసులు ఒకటయ్యాయి కాబట్టి ఇక మనుషులు కూడా ఒక్కటవ్వాలని భావించారు. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి జీవించాలని కుటుంబసభ్యులకు తమ ప్రేమ వ్యవహారం గురించి తెలిపారు. ఈ క్రమంలోనే యువతి తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు.
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించినవాడిన పెళ్లాడలేక... అతడిని పెళ్లిచేసుకోకుండా వుండలేక యువతి మనోవేదనకు గురయ్యింది. ఈ క్రమంలోనే తీవ్ర డిప్రెషన్ కు లోనయిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. విజయవాడ నుండి తాడేపల్లి వద్దగల కృష్ణానది వద్దకు చేరుకున్న యువతి వంతెనపై నుండి దూకేసింది.
అయితే యువతి నదిలో దూకడాన్ని ఓ ఆటోడ్రైవర్ వెంకటేష్ గమనించాడు. దీంతో వెంటనే అతడు కూడా ప్రాణాలకు తెగించి నదిలోకి దూకి యువతిని కాపాడాడు. యువతిని ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించాడు.
వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని అడిగి కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులతో పాటు యువతికీ కూడా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఆటోడ్రైవర్ వెంకటేష్ ను పోలీసులు, స్థానికులు ప్రశంసించారు.