
గోవధ నిషేధంపై శనివారం తాను మాట్లాడిన మాటల విషయంలో వైసీపీకి, సీఎంవో కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదన్నారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి. తాను హిందుమతానికి వ్యతిరేకంగా పని చేస్తున్నానని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను పక్కా హిందువునని, హిందు దేవుళ్లనే కొలుస్తానని చెన్నకేశవరెడ్డి స్పష్టం చేశారు. మైనార్టీలపై బీజేపీ నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలను వ్యతిరేకించే బీజేపీ గోవును అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను పరిపాలించాలని చూస్తోందని చెన్న కేశవ రెడ్డి ఆరోపించారు.
Also Read:గోవధ చట్టాన్ని ఎత్తివేయాలి: వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలనం
అంతకుముందు ఎమ్మిగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నమయ్య కూడలి వద్ద వున్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు బీజేపీ నేతలు. ఆ పార్టీ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ హెచ్చరించడంతో ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.