
పల్నాడు : అధికార పార్టీలో తనకు గుర్తింపు దక్కడంలేదంటూ ఓ వైసిపి నాయకుడు ఆందోళనకు దిగాడు. తాను వైఎస్ జగన్ వీరాభిమానిని అంటూ బ్యానర్ కట్టుకుని... దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందు టెంట్ వేసుకుని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుకున్నాడు సదరు వ్యక్తి. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
దాచేపల్లి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆంజనేయులు 2011 నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడట. ప్రతిపక్షంలో వుండగా పార్టీకి సేవ చేసానని... 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించడంతో తన శక్తిమేరకు పనిచేసినట్లు తెలిపాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు ఎలాంటి గుర్తింపు దక్కడంలేదని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేసాడు.
వీడియో
దాచేపల్లి వైసిపి పార్టీలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని... అందువల్లే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఆంజనేయులు తెలిపాడు. తన కష్టాన్ని గుర్తించి వైసిపిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని స్థానిక వైసిపి నాయకులు హామీ ఇస్తేనే తన నిరాహార దీక్షను విరమిస్తానని ఆంజనేయులు తెలిపారు. ఎన్ని రోజులయినా వైఎస్సార్ విగ్రహం ముందే తన నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆంజనేయులు స్పష్టం చేసారు.