జగన్ ఆస్తుల కేసు: వీడియో విడుదల చేసిన రఘురామ కృష్ణం రాజు

By telugu teamFirst Published Jun 2, 2021, 8:06 AM IST
Highlights

బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తాను వేేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వేసిన కౌంటర్ మీద రఘురామ కృష్ణం రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో తాను దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణలో తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు వీడియో విడుదల చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగలవారం నాడు దాఖలు చేసిన ఆ కౌంటర్ లో తనపై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన చెప్పారు 

తనకు ఏ కేసులో కూడా శిక్ష పడలేదని, తనపై ఒక్క చార్జిషీట్ కూడా లేదని, ఎఫ్ఐఆర్ లు మాత్రమే నమోదయ్యాయని రఘురామ చెప్పారు. తాను విడుదల చేసిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తాను ప్రజల మేలు కోసం పోరాటం చేస్తున్నానని, తన పోరాటంలో ఏ విధమైన స్వార్థం లేదని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల దయతో, వేంకటేశ్వరస్వామి అండదండలతో కచ్చితంగా జగన్ బెయిల్ రద్దు కేసులో తనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. 

15 రోజుల తర్వాత అందరితో తాను మళ్లీ మాట్లాడుతున్నానని, ఈ మధ్యలో ఏం జరిగిందో మీకంతా తెలుసునని, ఇప్పుడు తాను వేరే కేసు గురించి మాట్లాడుతానని, తనపై నమోదైన కేసు గురించి మాట్లాడబోనని.. మాట్లాడకూడదని ఆయన అన్నారు. అనేక కేసుల్లో తొలి ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ మూడు సార్లు వాయిదా పడిన తర్వాత మంగళవారంనాడు తిరిగి విచారణకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 

తన పిటిషన్ మీద జనగ్ కౌంటర్ దాఖలు చేశారని ఆయన చెప్పారు. రెండు సిబిఐ ఎఫ్ఐఆర్ లు, పోలీసు స్టేషన్లలో ఏడు ఎఫ్ఐఆర్ లు ఉన్న వ్యక్తి తన బెయిల్ రద్దుకు పిటిషన్ వేయడమేమిటని జగన్ తన కౌంటర్ లో ప్రశ్నించారని ఆయన అన్నారు. ఒక వేలు అటు చూపిస్తే నాలుగు వేళ్లు తనవైపు చూపెట్టినట్లుగా ఆ వైఖరి ఉందని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ తాను శిక్ష పడిన వ్యక్తిని కాదని రఘురామ అన్నారు.

ఇదిలావుంటే, ఢిల్లీలోని ఎయిమ్స్ లో రఘురామ కృష్ణం రాజు మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కుడి కాలి గాయం వారంలో నయం అవుతుందని వైద్యులు చెప్పారు. ఎడమ కాలి కణాలు బాగా దెబ్బ తినడం వల్ల పూర్తిగా నయం కావడానికి మరో రెండు వారాలు పడుతుందని చెప్పారు విశ్రాంతి తీసుకోవాలని వారు రఘురామకు సలహా ఇచ్చారు.  

click me!