విజయసాయి టార్గెట్ గా వ్యాఖ్యలు: వెనక్కి తగ్గని రఘురామకృష్ణమ రాజు

By telugu teamFirst Published Jun 27, 2020, 12:48 PM IST
Highlights

తమ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిని లక్ష్యం చేసుకుని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు వ్యాఖ్యలు చేశారు. రాజ్ నాథ్ సింగ్ ను, కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. తన వ్యాఖ్యల ద్వారా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తాను దుర్భాషలాడలేదని చెప్పారు. ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని చెబుతున్నారని, తనకు అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తానని ఆయన చెప్పారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఇప్పటికే జగన్ కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను, ఎంపీని అని ఆయన అన్నారు. 

Also Read: జగన్ మీద పోరు: కేంద్ర మంత్రులతో రఘురామ కృష్ణమ రాజు భేటీలు

విధివిధానాలు తెలుసుకోవడానికే తాను ఎన్నికల కమిషన్ ను కలిసినట్లు ఆయన తెలిపారు. తనకు ప్రాణ హానీ ఉంది, రక్షణ కల్పించాలని కిషన్ రెడ్డికి చెప్పానని, విషయాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆయన తెలిపారు. తనకు రక్షణ కల్పించేవరకు నియోజకవర్గానికి వెళ్లబోనని ఆయన చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అందుకే రక్షణ కల్పించాలని కోరానని ఆయన చెప్పారు. తనకు రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నట్లు ఆయనతెలిపారు.  

రాజ్ నాథ్ సింగ్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు రఘురామ కృష్ణమ రాజు తెలిపారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వాళ్లే వార్తలు రాయించి, వాళ్లే షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఆయన విజయసాయి రెడ్డిని ఉద్దేశించి అన్నారు. విజయసాయి రెడ్డి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. 

Also Read: జగన్ పార్టీకే ఎసరు పెడుతున్న రఘురామకృష్ణమ రాజు: అసలేమవుతుంది?

ఒక భక్తుడిగా టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించినట్లు చిత్రీకరించారని ఆయన అన్నారు. వీలైతే షోకాజ్ నోటీసులను ఉపసహరించుకోవాలని ఆయన కోరారు. విజయసాయి రెడ్డి ఎన్ని దొంగ రాతలు రాయించినా తాను పార్టీకి విధేయుడినే అని ఆయన చెప్పారు. 

రఘురామ కృష్ణమ రాజు శనివారంనాడు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిశారు. తనకు రక్షణ కల్పించే విషయాన్ని తెలుసుకోవాడనికే తాను ఢిల్లీ వచ్చినట్లు రఘురామ కృష్ణమ రాజు చెప్పారు. 

click me!