సోమిరెడ్డిపై కేసు: మూర్ఖుల చేతికి అధికారమిస్తే.. అరాచకమే, జగన్‌పై బాబు ఆగ్రహం

By Siva KodatiFirst Published Jun 6, 2021, 9:31 PM IST
Highlights

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఖండించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. ఇది అత్యంత దుర్మార్గమని.. అర్ధరాత్రి కేసు నమోదుతోనే వైసీపీ నేతల కుట్ర బట్టబయలవుతోందంటూ మండిపడ్డారు. 

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఖండించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. ఇది అత్యంత దుర్మార్గమని.. అర్ధరాత్రి కేసు నమోదుతోనే వైసీపీ నేతల కుట్ర బట్టబయలవుతోందంటూ మండిపడ్డారు. అవినీతి పరుల్ని వదిలి.. అవినీతి బయటపెడితే కేసులా అని చంద్రబాబు ప్రశ్నించారు. మూర్ఖుల చేతికి అధికారమిస్తే.. అరాచకంతోనే రాజ్యమేలుతారని, ప్రజల ప్రాణాలు కాపాడే మందులోనూ వైసీపీ నేతల అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ చీఫ్ ఆరోపించారు.

అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ దుయ్యబట్టారు. జగన్ రెడ్డి మూర్ఖత్వంతో రాష్ట్రం ప్రతీకార కుంపటిగా మారిందని.. దొంగతనంగా మందు అమ్మేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలేవని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి బయటపెడితే నాన్ బెయిలబుల్ కేసులా అంటూ ధ్వజమెత్తారు. ఆనందయ్య మందుపై వైసీపీ వ్యాపారం శవాలపై చిల్లర ఏరుకోవడమేనని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Also Read:ఆనందయ్య మందుపై విమర్శలు: సోమిరెడ్డిపై కేసు నమోదు

కాగా,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదకుమార్ ఫిర్యాదు మేరకు చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెల్లూరు ఆనందయ్య మందును ఆన్‌లైన్ లో పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం తయారు చేసిన వెబ్‌సైట్ పై  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు గుప్పించారు.

చిల్‌డీల్.కామ్ వెబ్‌సైట్‌ను  గో డాడీ సంస్థ నుండి శేశ్రిత టెక్నాలజీ సంస్థ కొనుగోలు చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ వెబ్‌పైట్ ద్వారా ఆనందయ్య మందును  విక్రయించి సొమ్ము చేసుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై శేశ్రిత సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు

click me!