సిఐడి కోర్టు ఉత్తర్వులతో పరారీ ట్విస్ట్: రఘురామ కృష్ణం రాజుకు కొత్త చిక్కులు

By telugu teamFirst Published Jun 17, 2021, 8:10 AM IST
Highlights

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు జ్యుడిషియల్ కస్టడీని పెంచుతూ సిఐడి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రఘురామ కృష్ణం రాజు కొత్త చిక్కుల్లో పడ్డారు. ఆయన గుంటూరు రాక తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

గుంటూరు: దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేసిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు కొత్త చిక్కులు ఎదుర్కోబోతున్నారు. రిలీజ్ ఆర్డర్ మీద సంతకం చేయకపోవడాన్ని సాకుగా తీసుకుని ఏపీ సీఐడి ఆయనకు చిక్కులు కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఆయనను తిరిగి గుంటూరుకు రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. 

గత నెల 21వ తేదీన సుప్రీంకోర్టు రఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి పది రోజుల్లోగా సీఐడి కోర్టుకు బెయిల్ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. అయితే, రఘురామ కృష్ణం రాజు 24వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జై నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. 

రఘురామ తరఫు న్యాయవాదులు 28వ తేదీన గుంటూరులో సిఐడి కోర్టుకు షూరిటీలు సమర్పించారు. కోర్టు వాటిని ఆమోదించి గుంటూరు జిల్లా జైలుకు రఘురామ కృష్ణం రాజు రిలీజ్ ఆర్డర్ ను పంపించింది. ఆ పత్రాలనే జైలు సూపరింటిండెంట్ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి పంపించారు. అయితే, అప్పటికే రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. 

రఘురామ తమ వద్ద లేరంటూ రిలీజ్ ఆర్డర్ ను ఆస్పత్రి వర్గాలు గుంటూరు జిల్లా జైలుకు తిరిగి పంపించాయి. రిలీజ్ ఆర్డర్ మీద సంతకం చేయలేదు కాబట్టి సాంకేతికంగా రఘురామ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లేనని సిఐడి కోర్టు భావించింది. ఆయన రిమాండ్ ను ఈ నెల 25వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సిఐడి పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. 

నిబంధనల ప్రకారం రిలీజ్ ఆర్డర్ మీద సంతకం పెట్టుకుండానే రఘురామ వెళ్లిపోయారని, సాంకేతికంగా చూస్తే ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లేనని, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని అంటూ గుంటూరు జిల్లా జైలు సూపరింటిండెంట్ హంసపాల్ అర్బన్ ఎస్పీకి లేఖ రాశారు. అయితే, ఆ లేఖకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రాలేదు. రఘురామ పరారీలో ఉన్నారని, ఆయనను గుంటూరు తీసుకుని వచ్చి రిలీజ్ ఆర్డర్ మీద సంతకాలు చేయించాలనేది లేఖ ఆంతర్యమని అంటున్నారు. 

రఘురామ బెయిల్, విడుదల విషయంలో తాము పూర్తిగా చట్టప్రకారమే నడుచుకున్నామని ఆయన తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తాము రూ. లక్ష చొప్పున షూరిటీలు సమర్పించామని చెప్పారు. సిఐడి కోర్టు రఘురామ రిమాండ్ పొడగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. 

click me!