మనవడే ప్రశ్నిస్తాడు.. అప్పుడు నీ పరిస్ధితేంటి: బాబుపై విజయసాయి ఫైర్

By Siva KodatiFirst Published Apr 24, 2019, 5:05 PM IST
Highlights

మీ దోపిడీలు, దొంగతనాలను మీ మనవడు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడని.. ఏదో ఒక రోజున దేవాన్ష్ మిమ్మల్ని ప్రశ్నిస్తాడని అప్పుడు మీ పరిస్ధితేంటని విజయసాయి ప్రశ్నించారు. 

1,381 కేజీల బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

భారీ స్థాయిలో బంగారం తరలింపు జరుగుతున్నా టీటీడీ అధికారులెవ్వరూ ఎందుకు లేరని సందేహం వ్యక్తం చేశారు. చెన్నై నుంచి తిరుపతి వచ్చే సమయంలో సదరు వాహనం జాతీయ రహదారిపై నుంచి కాకుండా వేపంపట్టు అనే ప్రదేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.

ప్రతి అంశంపైనా, చెత్త విషయాలకు స్పందించే ముఖ్యమంత్రి టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని విజయసాయి ప్రశ్నించారు. తొలుత ప్రధానార్చకులు రమణ దీక్షితులను తొలగించి.. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు అర్చకులను కూడా ఇంటికి పంపించారన్నారు.

ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించారని, ఆ తర్వాత యనమల వియ్యంకుడిని ఛైర్మన్‌గా నియమించారని ఎద్దేవా చేశారు. దేవుడి సొమ్మును దోపిడీ చేసేందుకే పక్కా ప్లాన్‌తో చంద్రబాబు వ్యవహరించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

వరుసపెట్టి సీఎస్‌లను మార్చారని.. ఆయన హయాంలో పనిచేసిన ముగ్గురు ఛీప్ సెక్రటరీలు ముఖ్యమంత్రి పనితీరును తప్పుబట్టారని ఆయన గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిపిన తవ్వకాలలో గోప్యత ఎందుకు పాటించారని, తవ్వకాల్లో బయటపడిన గుప్తనిధులను ఏమయ్యాయని విజయసాయి ప్రశ్నించారు.

విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టారని, వాటిని పునర్మిస్తామన్న చంద్రబాబు మాట తప్పారని ఆయన ఎద్దేవా చేశారు. మీ దోపిడీలు, దొంగతనాలను మీ మనవడు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడని.. ఏదో ఒక రోజున దేవాన్ష్ మిమ్మల్ని ప్రశ్నిస్తాడని అప్పుడు మీ పరిస్ధితేంటని విజయసాయి ప్రశ్నించారు. 

click me!