హైదరాబాదులో ఏపీ సీఐడి చేతిలో అరెస్టు: కేసీఆర్ కు రఘురామ కృష్ణం రాజు లేఖ

By telugu team  |  First Published May 30, 2021, 8:32 AM IST

హైదరాబాదులో ఏపీ సిఐడి తనను అరేస్టు చేసిన సంఘనటపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తన అరెస్టు విషయంలో నియమనిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.


అమరావతి: హైదరాబాదులో ఏపీ సీఐడి అధికారులు తనను అరెస్టు చేయడంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్రం పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలను, మార్గదర్శకాలను హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని ఆయన కేసీఆర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. 

ఆ అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్ చెబుతున్న మార్గదర్శకాలను రఘురామ తన లేఖలో వివరించారు తన అరెస్టు విషయంలో జరిగిన నియమ నిబంధనల ఉల్లంఘనలను ఆయన కేసీఆర్ కు రాసిన లేఖలో తెలిపారు. ఆ మేరకు ఆయన 8 పేజీల లేఖ రాశారు. 

Latest Videos

తనపై ఏపీ సిఐడి సూమోటోగా కేసు నమోదు చేసిందని, ఈ కేసును గుంటూరు సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ నేతృత్వంలో పర్యవేక్షిస్తోందని, ఈ నెల 14వ తేదీన హైదరాబదు గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ లోని తన నివాసమైన 74వ నెబంర్ విల్లాకు ఒక బృందం వచ్చిందని ఆయన చెప్పారు. తనను ఏపీ సిఐడి అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనీసం పోలీసు మాన్యూవల్ ను కూడా పట్టించుకోలేదని ఆయన కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. 

ఎంపీనైన తన అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదని, ఏపీ సిఐడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్ తీసుకోలేదని, అసలు ఎఫ్ఐఆర్ ఉందో లేదో కూడా పరిశీలించలేదని ఆయన చెప్పారు 

తనను అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలనే నిబంధనను కూడా పట్టించుకోలేదని, తనను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏపీసిఐడి న్యాయబద్దంగా, చట్టబద్దంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించారని ఆయన విమర్శించారు. 

రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో భాగంగా తన అరెస్టుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని, అది కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సరిహద్దును దాటే ముందు ప్రస్తుత నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుంతి ఏపీసిఐడి తీసుకోలేదని ఆయన అన్నారు

click me!