ఆత్మహత్యేనా?... వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి

By Bukka SumabalaFirst Published Aug 20, 2022, 6:43 AM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనంతపురంలో కలకలం రేపింది. మొదట అతనిది ఆత్మహత్యగా ప్రచారం జరిగింది. అయితే, తరువాత అది అనుమానాస్పదమృతిగా భావిస్తున్నారు. 

అమరావతి :అనంతపురంలో ఓ మరణం కలకలం రేపింది. ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్ నూట ఒకటో నెంబర్ ప్లాట్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంజునాథ రెడ్డి అప్పుడప్పుడు ఈ ఫ్లాట్ కి వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్తుండేవాడు. మూడు రోజుల కిందట ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం శవమై కనిపించారు. మంజునాథ రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. 

ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి. వైసీపీ నాయకుడు,  పిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ యజమాని. కుమారుడి మృతి వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. మంజునాథ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని సోషల్ మీడియాలో మొదట విస్తృతంగా ప్రచారం జరిగింది. ఘటనా స్థలంలో పరిస్థితులు గమనించినా, స్థానికులు చెబుతున్న అంశాలు విన్నా ఇది అనుమానాస్పద మృతి గానే కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు నోరు మెదపకపోవడం, ఫోన్లు చేసినా స్పందించకుండా గోప్యత పాటించడం.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. మంజునాథ రెడ్డి భార్య స్రవంతి డాక్టర్.

అనంతపురం ద్రాక్షతోటలో ముగ్గురు అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

అన్నీ అనుమానాలే…. 
మంజునాథ రెడ్డి ఎలా చనిపోయాడు అనే వివరాలు అపార్ట్మెంట్లో వారు చెప్పలేకపోతున్నారు. ‘101 ఫ్లాట్ బాధ్యతలు చూసే నరేందర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో వచ్చి ఫ్లాట్ లోకి వెళ్లారు. ఆ తర్వాత కొంతసేపటికే అంబులెన్స్ వచ్చింది’ అని స్థానికులు చెబుతున్నారు. తాను వెళ్లేసరికి ఫ్లాట్లోని కిటికీలన్నీ మూసి ఉన్నాయని, గొల్లం పెట్టుకొని మంజునాథ రెడ్డి లోపలే ఉన్నారని, తాను కిటికీ తలుపు తెరిచి లోపలికి వెళ్లానని నరేందర్ రెడ్డి తమతో చెప్పాడని స్థానికులు అంటున్నారు. ‘మంజునాథ రెడ్డి పడిపోయాడు అంటూ నరేంద్ర పిలవడంతో అంబులెన్స్ లోకి ఎక్కించడానికి మేమంతా అక్కడికి వెళ్లాం. ఆయన మంచం కింద పడుకుని ఉన్నట్లుగా కనిపించారు. ఆయన ఫ్లాట్ లోపలే మరణించారా? మధ్యలో చనిపోయారా, ఆస్పత్రికి వెళ్ళాక ప్రాణం విడిచారా అన్నది తెలియదు’ అని స్థానికులు వివరించారు. మంజునాథ రెడ్డి మృతదేహం ప్రస్తుతం మణిపాల్ హాస్పటల్ లో ఉంది.

బిల్లులు అందక ఒత్తిడి..
‘కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో చేసిన కొన్ని పనులకు సంబంధించి రాంకీ సంస్థ నుంచి మా కంపెనీకి బిల్లులు రావాల్సి ఉంది. మరోవైపు సకాలంలో బ్యాంకు నుంచి ఫైనాన్స్ అందలేదు. ఈ నేపథ్యంలో మా అబ్బాయి కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్నారు’ అని మంజునాథ రెడ్డి తండ్రి  మహేశ్వర్ రెడ్డి ఓ  మీడియా సంస్థకు వెళ్లడించారు. సాయంత్రం సమయంలో చనిపోయినట్లు తమకు ఫోన్ వచ్చిందని,  వెంటనే విజయవాడకు బయలుదేరామని వివరించారు. ఆయన స్వగ్రామం అప్పిరెడ్డిగారిపల్లెలో విషాదం అలుముకుంది.

click me!