కేంద్రం మెడలు ఒంచలేకపోతున్నాం...ఎందుకో తెలుసా?: అంబటి సంచలనం

By Arun Kumar PFirst Published Mar 30, 2021, 4:59 PM IST
Highlights

ప్రత్యేక హోదా తెస్తామన్నారు కదా? మరి ఎందుకు తేలేదు? అని వైసిపి నాయకులను చంద్రబాబు అడుగుతున్నారని... అందుకు సమాధానం చెప్పారు అంబటి రాంబాబు.. 

గుంటూరు:  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడని... అయితే ప్రత్యేక హోదా అన్న పదం కూడా ఉచ్ఛరించే నైతిక హక్కు ఆయనకు లేదని సత్తెనపల్లి వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు కదా? మరి ఎందుకు తేలేదు? అని వైసిపిని అడుగుతున్నారని... అందుకు ఈ విధంగా సమాధానం చెప్పారు అంబటి. 

''ఇవాళ నెంబర్ గేమ్‌ మీకు తెలియదా? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని చెబుతావు. ఇవాళ నెంబరు గేమ్‌లో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ రావడం వల్ల వారికి మా మద్దతు అవసరం లేకపోవడం వల్ల, వారి మెడలు మనం ఒంచలేకపోతున్న సందర్భాలు ఉన్నాయి. అయినా సమయం కోసం చూస్తాం. అన్ని ప్రయత్నాలు చేస్తాం తప్ప మీలాగ ప్రజలను మోసం చేసే తత్వంతో మేము లేమని   గుర్తించండి'' అని అంబటి వెల్లడించారు. 

''కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో 5 ఏళ్లు కలిసి పని చేసిన, అధికారం పంచుకున్న ప్రభుత్వం మీది. పార్టీ మీది. ఆరోజు మీరేమన్నారు?. విభజన చట్టంలో అనేక అంశాలతో పాటు, ప్రత్యేక హోదా అన్న అంశం కూడా ఉంటే మీరేమన్నారు?. ప్రత్యేక హోదా ఎందుకు? ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని బ్రతికిస్తుందా? ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా బ్రతికిస్తుందని సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేసి, ప్రత్యేక హోదా అన్న అంశాన్ని నిట్టనిలువుగా ముంచిన మోసగాడివి నువ్వు కాదా? చంద్రబాబునాయుడు అని అడుగుతున్నాను. అందుకే ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు'' అని విమర్శించారు.

read more  

''ఆరోజే కాదు ఇవాళ్టికి కూడా మేము మనవి చేస్తూనే ఉన్నాం. ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రాన్ని ఒక పద్ధతిగా ముందుకు తీసుకుపోతుందని నమ్ముతున్నాం. దాని కోసం పోరాడుతూనే ఉంటాం. అడుగుతూనే ఉంటాం. ప్రయత్నం చేస్తూనే ఉంటామని దయచేసి గుర్తు పెట్టుకోండి'' అని అన్నారు. 

''ఆరోజు కేంద్రంలో ఎన్డీఏ మీ సపోర్టుతో అధికారంలోకి వస్తే దాంతో రాజీ పడిపోయి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి కాంప్రమైజ్‌ అయిపోయి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని ఈ రాష్ట్రానికి దారుణమైన మోసం చేసిన నువ్వు.. ఇవాళ మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు. ప్రజలకు మేము సమాధానంగా ఉంటాం. ప్రత్యేక హోదా గురించి మేము ఎప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉంటాం. తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రత్యేక హోదాను తేవడానికి పని చేస్తూనే ఉంటాం'' అని అంబటి వెల్లడించారు. 

click me!