
వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సదావర్తి భూముల రూపంలో భారీ లాటరీ తగిలింది. తమిళనాడులోని మహాబలిపురం రోడ్డలో ఉన్న సుమారు 84 ఎకరాలు ఆళ్ళకి సొంతం కాబోతున్నాయి. అత్యంత విలువైన భూములను చంద్రబాబునాయుడు ప్రభుత్వం టిడిపి నేతల సొంతం చేద్దామని మాస్టర్ ప్లాన్ వేసింది. సదావర్తి భూములు ఆక్రమణల పాలవుతున్నాయని, వాటిని కాపాడలేకున్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం కేవలం రూ. 22 కోట్లకే కట్టబెట్టాలని నిర్ణయించింది.
నిర్ణయించటమే కాకుండా టిడిపి నేత, కాపు కార్పొరేషన్ ఛైర్మన్, తనకు బాగా నమ్మకస్తుడైన రామానుజయ్యకు కట్టబెట్టేసింది కూడా. ఇక్కడే చంద్రబాబు ప్లాన్ రివర్స్ అయింది. ఎప్పుడైతే సదావర్తి భూముల విషయం వెలుగు చూసిందో వెంటనే ఆళ్ళ కోర్టుకెక్కారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 800 విలువైన భూములను చంద్రబాబు తన బినామీకి ఇప్పించుకున్నట్లు కోర్టులో కేసు వేసారు.
ఇరువైపుల వాదనలు విన్న కోర్టు రూ. 22 కోట్లకన్నా అదనంగా ధర వచ్చే విధంగా బహిరంగ వేలం ద్వారా అమ్మాలని ఆదేశించింది. అయితే, కొంతకాలం తర్వాత రూ. 22 కోట్లకన్నా ఎక్కువ ధర ఇచ్చి కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇక్కడే ప్రభుత్వం కోర్టుకు దొరికిపోయింది.
అయితే, వెంటనే కోర్టు స్పందిస్తూ ప్రభుత్వం తెలిపిన రూ. 22 కోట్లకన్నా అదనంగా రూ. 5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసే వారుంటే వారికే అమ్మాలంటూ మరో షరతు విధించింది. అదే సమయంలో ఆళ్ళను కూడా ఆసక్తి ఉంటే కొనుక్కోవచ్చని చెప్పింది. దాంతో ఆళ్ళ ముందుకొచ్చారు.
ఈరోజు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన రూ. 22 కోట్లకు అదనంగా రూ. 5 కోట్లు చెల్లించి కొనుగోలు చేయటానికి తాను సిద్దమేనని చెప్పారు. దాంతో కోర్టు స్పందించి రూ. 27 కోట్లకు మొత్తం 84 ఎకరాలను ఆళ్ళకే అమ్మాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం భూములను ఆళ్ళకు అమ్ముతుందా లేక ఏదైనా మెలికి పెడుతుందా చూడాలి.
సరే ఇప్పటికైతే కోర్టు ఆదేశాలతో ఆళ్ళకు భారీ లాటరీ తగిలినట్లైంది. అంటే సుమారు రూ. 800 కోట్ల విలువైన 84 ఎకరాలను ఆళ్ళ కేవలం రూ. 27 కోట్లకే సొంతం చేసుకోబోతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు అంత పెద్ద లాటరీ తగలటం ఆళ్ళకు అదృష్టమనే చెప్పాలి. సరే, తమిళనాడులో ఆక్రమణల్లో ఉన్న భూములను సొంతం చేసుకోవాలంటే కొంత శ్రమపడక తప్పదు లేండి.