ఆనందయ్య మందుతో కోట్లు కొల్లగొట్టేలా... వైసిపి నేతల మాస్టర్ ప్లాన్ ఇదే..: యనమల

By Arun Kumar PFirst Published Jun 7, 2021, 10:56 AM IST
Highlights

ఆనందయ్య మందు పంపిణీలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని హైకోర్టు స్పష్టంగా చెప్పినా వైసిపి నేతలు ఏవిధంగా జోక్యం చేసుకుంటారు? అని మాజీ మంత్రి యనమల ప్రశ్నించారు. 

గుంటూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే సంకెళ్లు అన్న చందంగా సాగుతోందని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వ అవినీతిని ఎవరు ప్రశ్నిస్తే వారిపై అడ్డగోలుగా తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 

''ఆనందయ్య మందు పంపిణీలో ప్రభుత్వ జోక్యం ఉండరాదని హైకోర్టు స్పష్టంగా చెప్పినా వైసిపి నేతలు ఏవిధంగా జోక్యం చేసుకుంటారు? హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేగాక ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ తయారుచేసి కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన శేశ్రిత కంపెనీ అధినేత నర్మద రెడ్డిపై కేసు పెట్టకుండా ...అక్రమాలను ప్రశ్నించిన సోమిరెడ్డిపై ఏవిధంగా కేసుపెడతారు?'' అని ప్రశ్నించారు. 

''మరోవైపు చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతంగా మందు తయారుచేసి తమ లేబుల్ వేసి మరీ మందు పంపిణీ చేస్తున్నారు? ఇదంతా చూస్తుంటే ఆనందయ్య మందు పేరుతో ఏదోవిధంగా నకిలీలు సృష్టించి భారీగా సొమ్ము చేసుకోవాలని అధికార పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. మందు తయారీకి ప్రభుత్వం తరపునుంచి రూపాయి సాయం చేయకపోగా, ఆనందయ్య మందును సొమ్ముచేసుకోవడానికి కొందరు అధికారపార్టీ నేతలు పడుతున్న పాట్లు అత్యంత హేయం'' అని మండిపడ్డారు.

read more  నేడు ఆనందయ్య మందు పంపిణీ: సర్వేపల్లి నియోజకవర్గం వారికే..

''విజయవాడలో ఒక హోటల్ లో బోర్డు డైరక్టర్ల సమావేశం నిర్వహించారంటూ సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్లపై మరో తప్పుడు కేసు బనాయించారు. ఏవిధంగానైనా డెయిరీని నిర్వీర్యం చేసి అమూల్ కు అప్పగించడమే జగన్మోహన్ రెడ్డి వైఖరిగా కన్పిస్తోంది. విశాఖపట్నంలో మానసిక వికలాంగుల సంస్థకు చెందిన స్థలాన్ని కబ్జాచేసేందుకు అధికారపార్టీ నేతలు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఈ సంఘటనలన్నీ అద్దం పడుతున్నాయి'' అని ఆరోపించారు.  

''చరిత్రలో హిట్లర్ వంటి మహా నియంతలే మట్టికరిచారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దౌర్జన్యపూరిత, విధ్వంసకర పాలనపై ప్రజలు తిరగబడి బుద్దిచెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇకనైనా రాజకీయ ప్రత్యర్థులపై అప్రజాస్వామిక విధానాలను విడనాడాల్సిందిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం'' అని యనమల పేర్కొన్నారు. 

 

click me!