పంచాయతీ కార్యదర్శి భవాని ఆత్మహత్య కేసు : వైసీపీ నాయకుడు, మరో ఇద్దరి అరెస్ట్..

Published : Jul 25, 2022, 07:52 AM IST
పంచాయతీ కార్యదర్శి భవాని ఆత్మహత్య కేసు : వైసీపీ నాయకుడు, మరో ఇద్దరి అరెస్ట్..

సారాంశం

ఎస్టీ మహిళ, పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని ఆత్మహత్య కేసులో ఓ వైసీపీ నాయకుడు, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమలాపురం : కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని జూలై 7న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసు పలు మలుపులు తిరిగింది. చివరకు ఓ కొలిక్కి వచ్చింది. ఆదివారం ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి విలేకరులకు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. భవాని కుటుంబసభ్యుల భిన్న సమాధానాలు, కాల్ రికార్డింగ్లు, వాట్సాప్ చాట్ లు విలేకరులకు చూపించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ ఘటనలో 306, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. డిఎస్పి మాధవ రెడ్డి కేసు మీద సమగ్ర విచారణ జరిపారు. సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన మహిళ భర్త, వైసీపీ నాయకుడు వరసాల సత్యనారాయణ రూ.32 వేలు, వార్డు సభ్యురాలు భర్త  ముత్తాబత్తుల సూరిబాబు, 14వ వార్డు సభ్యులు ఎర్రంశెట్టి నాగరాజు భవాని మీద ఒత్తిడి చేసి చెరో రూ.10వేలు తీసుకున్నట్లు రుజువైంది. 

వారి ముగ్గురిని అరెస్టు చేశాం. తాను మానసికంగా, ఆర్థికంగా,  ఉద్యోగ, ఆరోగ్యం పరంగానూ ఇబ్బందులు పడుతున్నట్లు భవానీ తన భర్త చిన్నుకు వాట్సాప్ లో  జూన్24న మెసేజ్ పంపించింది. రూ.57.35 లక్షల బ్యాంకు అప్పులు ఉన్నాయి. పొలం  అమ్మి తీరుద్దామని అందులో తెలిపింది. అయితే ఆ మెసేజ్ లను చిన్ను డిలీట్ చేశాడు. విచారణలో అప్పులేమీ లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. కాల్ రికార్డింగ్, వాట్స్అప్ చాట్ ద్వారా పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసే విషయంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని భవాని ఆందోళన చెందినట్లు.. వైసీపీ నాయకులు డబ్బులు డిమాండ్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది’ అని వివరించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీపీ భర్త దంగేటి రాంబాబుపై సాక్షాలు  రుజువు కాలేదని తెలిపారు. ఆధారాలు ఉంటే తమకు అందజేస్తే.. ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. 

మహిళా ఎంపీడీవోపై వైసీపీ నేత వీరంగం.. చెప్పింది వినకపోతే చీరేస్తామంటూ బెదిరింపు...

ఇదిలా ఉండగా, కోనసీమ జిల్లాలో జూలై 8న వేధింపులతో ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకుంది.  ఉప్పలగుప్తం మండలం చెర్లపల్లి పంచాయతీ కార్యదర్శి, ఎస్టి మహిళ  అయిన  రొడ్డా భవాని(32)  గురువారం అమలాపురం మండలం కామనగరువులోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త వెంకటేశ్వరరావు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన భవాని పదేళ్లక్రితం వెంకటేశ్వరరావును వివాహం చేసుకుంది. ఈమె 2019లో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా వచ్చారు. మూడు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే 90 రోజుల గడువు దాటిన మూడు రోజులకు సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి కొందరు  ఆమెను వేధిస్తున్నారు. 

ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. భవాని మృతదేహాన్ని అమలాపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు గురువారం సాయంత్రం వరకు ప్రయత్నించారు. డీఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని భవాని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఓ దశలో వాగ్వాదం చోటు చేసుకోగా సిఐ వీరబాబు,  ఎస్సై  పరదేశి కలగజేసుకుని సర్ది చెప్పారు. భవాని భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్