‘సారా మాటల’ డైవర్షన్ కోసమే ‘జిన్నా టవర్’ రాజకీయం: బీజేపీపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫైర్

By Mahesh KFirst Published Dec 31, 2021, 4:55 PM IST
Highlights

బీజేపీ నేతల ‘జిన్నా టవర్’ వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. సోము వీర్రాజు చేసిన రూ. 75లకే చీప్ లిక్కర్ వ్యాఖ్యల తర్వాతే బీజేపీ నేతలందరూ మూకుమ్మడిగా జిన్నా టవర్‌ పేరు మార్చాలనే అంశాన్ని తెరమీదకు తెచ్చారని, ఇది కేవలం సారా మాటల డైవర్షన్ కోసమేనని వాదించారు. మత ఘర్షణలతో రాష్ట్రంలో బీజేపీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నదని, కానీ, జగన్ పాలనలో అది సాధ్యం కాదని అన్నారు.
 

గుంటూరు: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Verraju) ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ. 75లకే అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై ఏపీ సహా తెలంగాణలోనూ విమర్శలు వినిపించాయి. ఈ వ్యాఖ్యల తర్వాత జిన్నా టవర్ చుట్టూ రాజకీయం రసవత్తరమైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీపై వైసీపీ(YCP) ధ్వజం ఎత్తుతున్నది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బీజేపీపై విమర్శలు సంధించారు. సోము వీర్రాజు మాట్లాడిన ‘సారా మాటల’(Cheap Liquor)ను డైవర్ట్ చేయడానికే బీజేపీ చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. ఆ మాటలను మరుగపరచడానికే జిన్నా టవర్ అంశాన్ని తెర మీదకు తెచ్చిందని ఆరోపించారు.

గుంటూరులో జిన్నా టవర్‌ను దేశ స్వాతంత్ర్యం రాకముందే నిర్మించారని వైసీపీ లీడర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దాన్ని ఇప్పుడు అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తున్నదని, ఇది ఆ పార్టీ సంస్కృతిని తేటతెల్లం చేస్తున్నదని విమర్శించారు. జీవీఎల్ నుంచి విష్ణు వరకు ఆ పార్టీ నేతలందరికీ సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ వ్యాఖ్యల తర్వాతే జిన్నా టవర్ ఎందుకు గుర్తుకు వచ్చింది? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే తాము కూల్చివేస్తామని బీజేపీ నేతలు మూకుమ్మడిగా విద్వేషం చిమ్మడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిగ్గు లేని చీప్ లిక్కర్ మాటలు మాట్లాడిందేగాక.. డైవర్షన్ రాజకీయాలూ చేస్తున్నదని మండిపడ్డారు. 

Also Read: వాళ్లు ఏం తాగుతారో తెలుసు: కేటీఆర్‌కి సోము వీర్రాజు కౌంటర్

జిన్నా టవర్‌ను అప్పట్లో మతసామరస్యం కోసం నిర్మించారని వివరించారు. దేశ భక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడటం అంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. మత ఘర్షణలు సృష్టించి రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నదని ఆరోపించారు. గుంటూరులోని జిన్నా టవర్ గురించి కడపలో ఉండే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్వీట్ చేయడం.. దాన్ని వెనువెంటనే సమర్థిస్తూ జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, రాజాసింగ్ వంటి బీజేపీ నేతలు గొంతు కలపడం చూస్తే ఇదంతా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక పథకం ప్రకారం బీజేపీ నేతలు చేస్తున్న కుట్రగా అర్థం అవుతున్నదని ఆరోపించారు. కానీ, ఏపీలో సీఎంగా వైఎస్ జగన్ ఉన్నన్ని రోజులు ఈ ఆటలు సాగవని స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ 2005లో పాకిస్తాన్‌లోని జిన్నా సమాధి వద్ద.. ఆయనను పొగిడారని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన జిన్నా..  గొప్ప లౌకికవాది అని, ఆయన హిందూ, ముస్లింలకు అంబాసిడర్ అని చేసిన ప్రశంసలను గుర్తు చేశారు.

Also Read: ‘వాహ్.. వాట్‌ ఏ స్కీమ్.. చీప్ లిక్కర్ ఆఫర్ బీజేపీ జాతీయ విధానామా?’.. సోము వీర్రాజుపై కేటీఆర్ సెటైర్లు

రాజకీయ లబ్ది కోసమే: ఎమ్మెల్యే ముస్తఫా

గుంటూరులోని జిన్నా టవర్‌కు జాషువా, అబ్దుల్ కలాం పేర్లు పెట్టవచ్చు అని బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అన్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసమేనని ఆరోపించారు. అన్ని కులాలు, మతాల వారు సామరస్యంగా మెలుగుతున్న తరుణంలో విద్వేషాలు సృష్టించేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

click me!