సీఎం సొంత జిల్లాలో వైసిపి షాక్ తప్పదా? చంద్రబాబుతో కీలక నాయకుడు భేటీ

By Arun Kumar PFirst Published Jun 19, 2021, 1:13 PM IST
Highlights

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.  

అమరావతి: సీఎం జగన్ సొంత జిల్లాలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.  హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. 

రాయచోటి నియోజవర్గంలో రాజకీయ పరిస్థితులు, నేతలు, కార్యకర్తల స్థితిగతులు వీరిమద్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే టిడిపి లో చేరేందుకు రాంప్రసాద్ రెడ్డి సిద్దమయ్యారని... ఆయన చేరికపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

read more జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ కంటే...ఆ క్యాలెండరే బెటర్: అచ్చెన్నాయుడు ఎద్దేవా

గతంలోనూ చంద్రబాబుతో రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. శ్రీకాళహస్తి పర్యటనలో వుండగా చంద్రబాబును ఆయన కలవడంతో అప్పుడే పార్టీ మార్పుపై ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి వీరిమధ్య భేటీ జరగడంతో రాంప్రసాద్ రెడ్డి టిడిపిలో చేరడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యంలోని జైసమైక్యంధ్ర పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన తర్వాత వైసిపిలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ తరఫున రాయచోటి ఎమ్మెల్యే స్థానం ఆశించి భంగపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదయినా కార్పోరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించాడు. ఆ సంకేతాలు కనిపించకపోవడంతో టిడిపిలో చేరేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది.  
 

click me!