మామ కోడలి గొడవ కాస్త రాజకీయ వైరంగా... టిడిపి నేతపై వైసిపి నాయకుడి హత్యాయత్నం

By Arun Kumar PFirst Published Nov 10, 2023, 10:49 AM IST
Highlights

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి నాయకుడిపై వైసిపి నేతల దాడిని  నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఖండించారు. 

అమరావతి : మామ కోడలి మధ్య గొడవలో తలదూర్చి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడో టిడిపి. కుటుంబ తగాదా కాస్త రాజకీయ వైరంగా మారి ఏ సంబంధంలేని నాయకులు గొడవపడ్డారు. ఈ క్రమంలో  వైసిపి నాయకుడు తన అనుచరులతో కలిసి టిడిపి నేతను బండరాళ్లతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.   
 
వివరాల్లోకి వెళితే... చంద్రగిరి మండలం భీమవరం పంచాయితీ మూలపల్లెలో మామ అన్నారెడ్డితో కోడలు ఈశ్వరికి ఆస్తి తగాదాలున్నారు. మామా కోడలి మధ్య పొలం విషయంలో వివాదం సాగుతోంది. వీరిద్దరు పోలీసులను ఆశ్రయించగా ఇది సివిల్ వివాదం కాబట్టి గ్రామపెద్దల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. ఇందుకు మామ కోడలు కూడా అంగీకరించి తెలిసినవారి వద్ద పంచాయితీ పెట్టారు. 

ఈశ్వరి తరపున భీమవరం టిడిపి అధ్యక్షుడు మునిరత్నం నాయుడు, అన్నారెడ్డికి మద్దతుగా వైసిపి నాయకుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి నిలిచారు. ఇలా తెలిసినవారి ఆస్తి తగాదాలో తలదూర్చిన టిడిపి, వైసిపి నాయకులు పంతానికి పోయి శతృవులుగా మారారు. ఈ క్రమంలోనే టిడిపి నాయకుడు మునిరత్నంపై వైసిపి నేత, ఆయన అనుచరులు బండరాళ్లతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తలపై రాళ్లతో దాడిచేయడంతో కిందపడిపోయిన మునిరత్నం చేతికున్న ఉంగరాలు, కడియంతో పాటు జేబులోని పదివేల రూపాయలను చంద్రశేఖర్ రెడ్డి, అనుచరులు దోచుకుని పరారయ్యారట.  ఈ దాడితో చంద్రగిరిలో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Read More  ముఖ్యమంత్రి చేస్తున్నది చాలదా..? వై ఏపీ నీడ్స్ జగన్? : నారా లోకేష్ సీరియస్

ఈ ఘటనపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునిరత్నంపై జరిగిన దాడిని నారా లోకేష్ ఖండించారు. భీమవరం గ్రామ టిడిపి అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై వైసిపి నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. అనుచరులతో కలిసి విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన మునిరత్నం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని... అతడి పరిస్థితి విషమంగా వుందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసాడు. అతడు త్వరగా కోలకోవాలని... పార్టీ అన్నివిధాలుగా అండగా వుంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. వైసిపి ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని లోకేష్ అన్నారు. 

ఇక  ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మునిరత్నంపై దాడిని ఖండించారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి రౌడీ అనుచరులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ రెడ్డి టిడిపి నాయకుడిపై దాడిచేయడం దారుణమన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి  లు తన చెంచాలను అదుపులో పెట్టుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాల్లో తిరుగుతూ శాంతిభద్రతలను గాలికి వదిలేసాడని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసారు. ఓటమి అంచులకు వైసిపి చేరింది... అది తెలిసే టిడిపి నాయకులపై దాడులు ప్రారంభించారని అన్నారు. ఎన్ని దాడులు, బెదిరింపులకు దిగినా టీడీపీ వెనకడుగు వేయదన్న విషయాన్ని వైసీపీ గూండాలు గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు.


 

click me!