నగరి వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు.. రోజా ప్రారంభించాల్సిన గ్రామ సచివాలయానికి తాళం

By Siva KodatiFirst Published Nov 12, 2022, 4:14 PM IST
Highlights

చిత్తూరు జిల్లా నగరిలో మరోసారి మంత్రి రోజాకు ఇబ్బందికర పరిస్ధితులు ఎదురయ్యాయి. వడమాలపేట మండలం పత్తి పుత్తూరులో మంత్రి ప్రారంభించాల్సిన గ్రామ సచివాలయానికి ఆమె వ్యతిరేక వర్గం తాళం వేసింది. 

చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. సాయంత్రం 4 గంటలకు వడమాలపేట మండలం పత్తి పుత్తూరులో గ్రామ సచివాలయాన్ని రోజా ప్రారంభించాల్సి వుంది. అయితే ఆ సచివాలయానికి తాళం వేశారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. సచివాలయ నిర్మాణానికి రూ.25 లక్షలు ఖర్చు చేశానని.. ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాలేదని ఆయన చెబుతున్నారు. జెడ్పీటీసీ తీరును మంత్రి రోజా వర్గం వ్యతిరేకిస్తోంది. మంత్రిని అడ్డుకోవడం కోసమే వ్యతిరేక వర్గం ఇలా చేస్తోందని ఆరోపిస్తోంది. 

కాగా.. నగరి నియోజకవర్గ వైసీపీలో మంత్రి రోజాకి, అక్కడి స్థానిక వైసీపీ నేతలకు మధ్య పడటం లేదు. రోజా రెండవసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నగరి వైసీపీలో గ్రూపులు ఎక్కువయ్యాయి. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆమె పలుమార్లు వ్యాఖ్యానించారు. మంత్రి, ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రతిరోజూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read:తాడేపల్లికి చేరిన నగరి పంచాయతీ... వ్యతిరేక వర్గంపై జగన్‌కు రోజా ఫిర్యాదు

పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీ ఇక్కడ తిరిగి బలం పుంజుకునే అవకాశాలు వున్నాయంటూ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో నగరి పంచాయతీ తాడేపల్లికి చేరింది. గత నెలలో సీఎం జగన్‌ను కలిసిన రోజా.... నగరి పరిణామాలపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. చక్రపారెడ్డి, ఇతర అసమ్మతి గ్రూపుల వైఖరిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి అంతర్గత కుమ్ములాటలతో తలబొప్పి కడుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. నిత్యం ఎవరో ఒకరు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుండటంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. దీంతో ఈ విషయాలు సీఎం జగన్ వరకు వెళ్లడంతో రాజీ కుదిర్చే బాధ్యతలను పార్టీ పెద్దలకు అప్పగిస్తున్నారు. మొన్నామధ్య సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్, అబ్ధుల్ ఘనీ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా అక్కడ అసమ్మతి వర్గాలు ఒక్కటవుతున్నాయి. మొన్నామధ్య ప్రెస్ క్లబ్ వేదికగా నేతల మధ్య రాళ్ల దాడి సైతం జరిగింది. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. వీరి మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు జగన్. దీంతో మూడు వర్గాలను మంత్రి అమరావతికి పిలిపించి మాట్లాడారు.
 

click me!