కాపు నాయకులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్... హోంశాఖ కీలక ఉత్తర్వులు

Arun Kumar P   | Asianet News
Published : Feb 03, 2022, 09:54 AM ISTUpdated : Feb 03, 2022, 10:12 AM IST
కాపు నాయకులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్... హోంశాఖ కీలక ఉత్తర్వులు

సారాంశం

కాపు సామాజికవర్గ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించిన సమయంలో పలు ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ సమయంలో కాపు నాయకులపై నమోదయిన కేసులన్నింటిని జగన్ సర్కార్ ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: కాపు (kapu) ఉద్యమంలో పాల్గొని కేసులను ఎదుర్కొంటున్న నాయకులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కేసుల నుండి కాపు నాయకులకు ఊరటనిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూ నమోదయిన అన్ని కేసులను వెనక్కు తీసుకుంటున్నట్లు జగన్ సర్కార్ పేర్కొంది. గతంలో చంద్రబాబు  (chandrababu) ప్రభుత్వ హయాంలో నమోదయిన కాపు ఉద్యమ కేసులన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్లు వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. 

2016 - 2019 మధ్య కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో నమోదయిన 176 కేసులను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ప్రస్తుతం పెండింగ్ లో వున్న ఈ కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేసారు. 

కాపు ఉద్యమ సమయంలో తూర్పుగోదావరి జిల్లా,  కిర్లంపూడి, ధవళేశ్వరం, అంబాజీపేట, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, గుంటూరు అర్బన్  తదితర పోలీసు స్టేషన్లలో ఏపీ పోలీస్ చట్టం, రైల్వే చట్టం కింద 329 కేసులు నమోదవగా ఇదివరకే 153 కేసులు డిస్పోస్ అయినట్టు ప్రభుత్వం తెలిపింది. తాజాగా మిగతా పెండింగ్ కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోం శాఖ స్పష్టం చేసింది. 

2016 జనవరిలో తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న కాపులు రత్నాంచల్ రైలుకు నిప్పుపెట్టారు.  ఈ ఘటనకు సంబంధించి తుని రూరల్ పోలీస్ స్టేషన్  లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ 17కేసులు విచారణలో వుండగానే ఉపసంహరించుకుంటున్నట్లు 2020లోనే జగన్ సర్కార్ ప్రకటించింది. డిజిపి సిపార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ ప్రకటించింది. 

ఇక ఈ రైలు దగ్ధం వ్యవహారంలో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి.  వీటిలో 51 కేసులను 2019లోనే వైసిపి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మిగతా  కేసులను 2020లో ఉపసంహరించుకుంది. తాజాగా మరికొన్ని కేసులను వెనక్కి తీసుకోవడంతో చాలామంది కాపు నాయకులకు ఊరట లభించింది.

కాపు నేత ముద్రగడ పద్మనాభం తమ సామాజికవర్గ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ టిడిపి ప్రభుత్వ హయాంలో భారీ ఉద్యమం చేపట్టారు. ఆయన పిలుపుతో కదిలిన కాపులు రోడ్లపైకి వచ్చి తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసారు. అయితే ఈ ఉద్యమం  ఉద్రిక్తతంగా మారి చాలామంది నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇలా టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు నేతలపైనమోదయిన కేసులను వైసిపి ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది.

ఇదిలావుంటే కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ఇటీవల కాపు సోదరసోదరీమణులకు బహిరంగ లేఖ రాశారని అంటున్నారు. 

కాపులకు రిజర్వేషన్లు సాధించే ఉద్దేశంతో ఆయన కాపు ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ సొంత సామాజిక వర్గానికి చెందినవారే తనపై కుట్రలు చేస్తున్నట్లు ఆయన భావిస్తున్నారు. కొంత మందితో కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నరని తన బహిరంగ లేఖలో చెప్పారు. దానికి తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆయన తెలిపారు. ఆ కారణంగానే ఆయన ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 
 

PREV
click me!

Recommended Stories

Indian Women’s Cricket Team Members Visit Narasimha Swamy Temple in Vizag | Asianet News Telugu
Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu