ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రాజకీయాలు సాగుతున్నాయి. రాజధాని అమరావతి ఉద్యమం నేపథ్యంలో రూపొందిన రాజధాని ఫైల్స్ మూవీ విడుదలకు సిద్దమవగా అడ్డుకునేందుకు వైసిపి హైకోర్టును ఆశ్రయించింది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను సినీ నటులే కాదు ఇప్పుడు సినిమాలు కూడా ప్రభావితం చేసేలా వున్నాయి. ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ లాంటి హీరోలే కాదు పొటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన సినిమాలు ప్రజలముందుకు వస్తున్నాయి. ఇలా అధికార, ప్రతిపక్షాలు తమ ప్రచారానికి సినిమాలను అస్త్రంగా వాడుకుంటున్నాయి. అయితే రాజకీయాలు, పార్టీల నేపథ్యంలో సాగే ఈ సినిమాల చుట్టూ వివాదాస్పదం అవుతున్నాయి.
ఇప్పటికే అధికార వైసిపికి అనుకూలంగా నిర్మించిన యాత్ర 2 విడుదలయ్యింది. ఈ క్రమంలోనే వైసిపి సర్కార్ కు వ్యతిరేకంగా అంటే ప్రతిపక్ష టిడిపి, జనసేనలకు అనుకూలంగా రూపుద్దిద్దుకున్న 'రాజధాని ఫైల్స్' మూవీ ప్రజతముందుకు వస్తోంది. ఈ సినిమాను పిబ్రవరి 15 అంటే రేపు విడుదల చేసేందుకు అంతా సిద్దంచేసుకున్నారు. కానీ పోలిటికల్ గా వైసిపి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఈ సినిమా విడుదలను అడ్డుకునేందుకు ఆ పార్టీ నేత ఒకరు రంగంలోకి దిగింది. ఈ మూవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వుందని... అందువల్ల విడుదలను ఆపాలని వైసిపి నేత లేళ్ల అప్పిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా సెన్సార్ బోర్డు, సినిమా నిర్మాతలను చేర్చారు. ఇప్పటికే సెన్సార్ బోర్డ్ జారీచేసిన దృవపత్రాన్ని రద్దు చేసి సినిమా విడుదలను ఆపాలని అప్పిరెడ్డి హైకోర్టును కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ మంత్రి కొడాలి నాని లతో పాటు మరికొందరు వైసిపి నాయకులను పోలివున్న పాత్రలు ఈ సినిమాలో వున్నాయని... ఆ నాయకులను చులకన చేస్తూ సన్నివేశాలు వుండవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ సినిమాను నిర్మించారు... కాబట్టి విడుదలను అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ అప్పిరెడ్డి హైకోర్టును కోరారు.
Also Read వైఎస్సార్ వారసుడిని అంటావుగా... అయితే ఆన్సర్ చెయ్..: జగన్ కు షర్మిల సవాల్
అయితే ఈ సినిమాను రెండుసార్లు వీక్షించి తమ అభ్యంతరాలను తెలిపామని సెన్సార్ బోర్డ్ హైకోర్టుకు తెలిపింది. వీటిని నిర్మాతలు చర్యలు తీసుకున్నాకే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చామన్నారు.
ఇక రాజధాని ఫైల్స్ సినిమా ఎవరిని అవమనించేలా లేదని... కేవలం కల్పిత పాత్రలనే ఇందులో చూపించామని నిర్మాతల తరపు న్యాయవాదులు తెలిపారు. సెన్సార్ బోర్డ్ సూచనలను పాటించి అభ్యంతరక సన్నివేశాలు ఏమయినా వుంటే వాటిని తొలగించినట్లు సినీ నిర్మాతలు తెలిపారు. కాబట్టి సినిమాను సజావుగా విడుదలయ్యేలా చూడాలని నిర్మాతల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనల విన్న అనంతరం తీర్పును ఏపి హైకోర్టు రిజర్వ్ చేసింది.