జగన్ కు 'కాపు' షాక్: జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ

By pratap reddyFirst Published Aug 18, 2018, 8:03 AM IST
Highlights

ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కాపు సెగ తగులుతున్నట్లే కనిపిస్తోంది. ఆయనకు తూర్పు గోదావరి జిల్లాలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

రాజమండ్రి:  ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు కాపు సెగ తగులుతున్నట్లే కనిపిస్తోంది. ఆయనకు తూర్పు గోదావరి జిల్లాలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పార్టీని వీడే అవకాశాలున్నాయి. ఆయన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్లపై నోరుజారడం, కాపు రిజర్వేషన్లపై తీసుకున్న వైఖరి జగన్ కు ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. 
 
ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దుర్గేశ్‌ కూడా పార్టీని వీడడం జగన్ కు కొంత మేరకు నష్టం కలిగించే విషయమేనని అంటున్నారు. దుర్గేష్ వైసీపీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి టికెట్‌ ఆశించారు. 

కాగా, గతంలో పోటీచేసిన ఆకుల వీర్రాజుకే టికెట్‌ ఇస్తామని జగన్‌ చెప్పినట్లు సమాచారం. ఈలోగా జిల్లాలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో దుర్గేశ్‌ వైసీపీకి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

దానిపై శనివారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీ చేయడానికి కూడా నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు.

click me!