ఉగ్రరూపం దాల్చిన గోదావరి....భారీగా వరద నీరు

By sivanagaprasad KodatiFirst Published Aug 17, 2018, 6:41 PM IST
Highlights

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు లంక గ్రామాలు నీట మునిగాయి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 11.7 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

రాజమహేంద్రవరం:
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు లంక గ్రామాలు నీట మునిగాయి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 11.7 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అన్ని గేట్లను ఎత్తివేసి 20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. 

ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టడంతో పలు లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. చాకలిపాలెం వద్ద కాజ్‌వే వరదనీటిలో మునిగిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి రాకపోకలు స్థంభించిపోయాయి. గంటగంటకు వరద నీరు పెరగుతుండటంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాలైన బూరుగులంక, ఊడుమూడిలంక, జి.పెదపూడి లంక, అరిగెలవారిపేట, పొట్టిలంక వంటి లంగక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వరద పోటు కారణంగా కోటిపల్లి-నర్సాపురం రైల్వే పనులకు ఆటంకం ఏర్పడింది.

ఇకపోతే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. 43 అడుగుల స్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో భద్రాచలం సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా మెదటిప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే వరదనీరు విపరీతంగా వచ్చి చేరుతుండటంతో ప్రస్తుత నీటిమట్టం 47.8 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం 48 అడుగులకు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 

వరద నీరు భారీగా రావడంతో భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు, విద్యుత్‌ స్తంభాలు వరద నీటిలో మునిగి పోయాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక రోడ్డుపైకి వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి. అటు శబరీ నది సైతం పోటెత్తుతుంది. దీంతో  విలీన గ్రామాలైన వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలకు రాక పోకలు స్తంభించాయి.

చింతూరు, వీఆర్ ‌పురం మండలాల్లో వరద నీరు రహదారులపై చేరడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చింతూరు మండలం చెట్టి వద్ద వరదనీరు రహదారిపై ప్రవహించడంతో ఆంధ్రప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. దేవీపట్నం మండలంలో సీతపల్లివాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో  రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  

మరోవైపు శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి సుమారు 80వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 

మరోవైపు  శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 3లక్షల 36వేల503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు లక్షా 3వేల792 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 874 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులకు చేరింది. జలాశయం సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 180.28 టీఎంసీలకు చేరింది. మరికొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. 


 

click me!