
విశాఖ (visakhapatnam district) పాయకరావు పేట (payakaraopeta) ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై (golla babu rao) అసమ్మతి సెగ రోడ్డెక్కింది. రాజువరం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను సొంత పార్టీ ఎమ్మెల్యేలే అడ్డుకున్నారు. గొల్ల వద్దు.. జగన్ ముద్దు నినాదాలతో ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే వాహనం రాకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలను పెట్టారు. దీంతో వాగ్వాదం జరిగింది. రహదారిపై వున్న వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఎస్ రాయవరంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై నేతలు భగ్గుమన్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా కేడర్ రోడ్డెక్కింది.
కాగా.. ఎమ్మెల్యే గొల్లబాబూరావు పైన సొంత పార్టీ నేతలే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తామంతా ఆయన్ని మూడు సార్లు కష్టపడి గెలిపిస్తే ఈ రోజు ఆయన టీడీపీ, జనసేన వంటి ఇతర పార్టీల వారిని అక్కున చేర్చుకుని తమను దూరం పెడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా కలసి పాయకరావుపేటలోని బంగారమ్మపాలెంలో రెండు రోజుల క్రితం సమావేశమై ఎమ్మెల్యే తీరు మీద విరుచుపడినట్లుగా సమాచారం. ఇందులో వైసీపీకి చెందిన ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా కీలక నేతలు, మాజీ సర్పంచులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అయ్యాక బాబూరావు తమను అసలు పట్టించుకోవడంలేదని, అన్ని విధాలుగా ప్రతిపక్ష నేతలకే సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.