ఎవరు చెప్పేది వాస్తవం ?

First Published Jul 8, 2017, 3:53 PM IST
Highlights

ఎవరికి వారు తమ పుస్తకంలో చెప్పిందే నిజమని చెప్పుకోవటం సహజమే కదా? మరి రెండు పుస్తకాల్లోని వివరాలను చూసుకున్న జనాలు రెండు పుస్తకాల్లోని అంశాలూ నిజమే అని అనుకుంటే? ఇద్దరూ అవినీతిపరులే కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఓట్లు వేయాల్సిన అవసరం లేదనుకుంటే?

అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు పుస్తకాలేసుకుంటున్నారు. అదీ ఒకందుకు మంచిదే లేండి. ఎందుకంటే, ఒకరి బండారాన్ని మరొకరు బయటపెట్టుకుంటేనన్నా జనాలకు పూర్తిగా కాకున్న కొంతైనా వాస్తవాలు తెలుస్తాయి కదా? చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్లీనరీ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ (అవినీతి చక్రవర్తి) అనే పుస్తకాన్ని విడుదల చేసారు లేండి. అంటే, చంద్రబాబుపై వైసీపీ ఓ పుస్తకాన్ని గతంలోనే అచ్చేసినా దానికి అనుబంధంగా మరికొన్ని అంశాలను జోడించింది.

వైసీపీ వాదన ప్రకారం అప్పటికి ఇప్పటికీ చంద్రబాబు అవినీతి బాగా ఎక్కువైందట. తాజాగా బయటపడిన విశాఖపట్నం జిల్లాలోని భూకుంభకోణాలు లాంటి వాటిని కలిపి ప్లీనరీ సంద్భంగా విడుదల చేసారు. సరే, బాగానే ఉంది. ప్రతిపక్షమే అధికారంలో ఉన్న పార్టీపైనా, ముఖ్యమంత్రిపైనా పుస్తకాన్ని అచ్చేసి వదిల్తే, అధికారంలో ఉన్న పార్టీ గమ్మునుంటుందా? ఇపుడు టిడిపి కూడా అదే పని మీద బిజీగా ఉందట.

పార్టీ సీనియర్ నేత, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అమరావతిలో ఈరోజు మాట్లాడుతూ, జగన్ పై తాము కూడా ఓ పుస్తకాన్ని అచ్చేసి వదులుతామన్నారు. ఆ పుస్తకానికి ‘నేరాల చక్రవర్తి’ అని పేరు కూడా పెట్టేసారండి. జగన్ చేసిన నేరాలు, ఘోరాలను సాక్ష్యాధారాలతో సహా వెల్లడిస్తామన్నారు. పనిలో పనిగా వైసీపీ చంద్రబాబుపై వేసిన పుస్తకాన్ని అబద్దాల పుట్టగా వర్ణించేసారనుకోండి అది వేరే సంగతి.

ఎవరికి వారు తమ పుస్తకంలో చెప్పిందే నిజమని చెప్పుకోవటం సహజమే కదా? మరి రెండు పుస్తకాల్లోని వివరాలను చూసుకున్న జనాలు రెండు పుస్తకాల్లోని అంశాలూ నిజమే అని అనుకుంటే? ఇద్దరూ అవినీతిపరులే కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఓట్లు వేయాల్సిన అవసరం లేదనుకుంటే?

జగన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారట. వైసీపీ తరపున 67 మంది ఎంఎల్ఏలను ప్రజలు గెలిపిస్తే ప్రజల విశ్వాసం కోల్పోయారనటం ఏంటో అర్ధం కావటం లేదు. కోర్టు కేసులు, దొంగ దీక్షలతో జగన్ అభివృద్ధి నిరోధకుడిగా మారారట. కోర్టు కేసులు జగన్ పైనే కాదు చంద్రబాబుపైన కూడా ఉందన్న విషయం యనమల మరచిపోయినట్లున్నారు. ఇక దీక్షలంటారా, ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళు చంద్రబాబు చేసిన దీక్షల గురించి కూడా యనమల చెబితే బాగుంటుంది.

click me!