భూమా మృతికి చంద్రబాబే కారణమా ?

First Published Mar 14, 2017, 5:50 AM IST
Highlights

మంత్రిపదవి ఇస్తామని చంద్రబాబు భూమాను ప్రలోభపెట్టారన్నారు. పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోగా మానసికంగా హింసించారంటూ సిఎంపై ధ్వజమెత్తారు.

అలాగనే వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అందుకనే అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని వైసీపీ బహిష్కరించింది. ఒక సభ్యుడి మరణంపై అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడితే బహిష్కరించటం బహుశా ఇదే తొలిసారేమో. తీర్మానాన్ని బహిష్కరిచిన వైసీపీ అందుకు కారణం మాత్రం టిడిపినే అని ఆరోపిస్తోంది. పోయిన ఎన్నికల్లో భూమా వైసీపీ తరపున గెలిచారు. అయితే, వివిధ కారణాల వల్ల టిడిపిలోకి మారారు. చంద్రబాబు పెట్టిన ప్రలోభాలు, ఒత్తిడి వల్లే భూమా టిడిపిలోకి మారరంటూ వైసీపీ ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తోంది.

 

ఈ నేపధ్యంలో భూమా హఠాత్తుగా మరణించారు. అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం సంతాప తీర్మానాన్ని టిడిపి ప్రవేశపెట్టింది. దాన్ని వైసీపీ బహిష్కరించింది. ఇదే విషయంపై వైసీపీ ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, భూమా మృతికి చంద్రబాబునాయుడే కారణమని ఆరోపించారు. భూమా మరణానికి కారణమైన పార్టీతో కలిసి సంతాప తీర్మానంలో పాల్గొనలేకే బహిష్కరించినట్లు స్పష్టం చేసారు. మంత్రిపదవి ఇస్తామని చంద్రబాబు భూమాను ప్రలోభపెట్టారన్నారు. పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోగా మానసికంగా హింసించారంటూ సిఎంపై ధ్వజమెత్తారు.

 

వైసీపీలో ఉన్నపుడు భూమా ఎంతో ఉల్లాసంగా ఉండేవారని, టిడిపిలోకి మారిన తర్వాతనే మానసికంగా కుంగిపోయారంటూ మండిపడ్డారు. కాబట్టి భూమా మరణానికి చంద్రబాబునానయుడే కారణమని స్పష్టం చేసారు. అందుకనే తాము అసెంబ్లీలో భూమా సంతాప తీర్మానాన్ని బహిష్కరించినట్లు లక్ష్మారెడ్డి చెప్పారు. ఇపుడు వైసీపీ చేసిన ఆరోపణలే భూమా మృతి తర్వాత ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉండటం గమనార్హం. సోషల్ మీడియాలో కూడా ఇదే విషయం బాగా ప్రచారంలో ఉంది.

  

click me!