వైసిపి ప్రభుత్వంలో పైలట్ పాత్ర ఆయనదే: యనమల సంచలనం

By Arun Kumar PFirst Published Jul 16, 2020, 12:14 PM IST
Highlights

అన్నా క్యాంటిన్లు మూయలేదని మానవ హక్కుల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం నయవంచనే అని... ప్రజలనే కాదు ఎన్‌హెచ్‌ఆర్‌సిని కూడా వైసిపి ప్రభుత్వం దగా చేయడం గర్హనీయమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 

గుంటూరు: అన్నా క్యాంటిన్లు మూయలేదని మానవ హక్కుల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం నయవంచనే అని... ప్రజలనే కాదు ఎన్‌హెచ్‌ఆర్‌సిని కూడా వైసిపి ప్రభుత్వం దగా చేయడం గర్హనీయమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.  అన్నా క్యాంటిన్లు లోకల్ బాడీస్ ఏమీ కాదని... వాటికి నిధులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. డబ్బులు ఇవ్వకుండా క్యాంటిన్లను మూతేసింది వైసిపి ప్రభుత్వమేనని ఆరోపించారు. 

''దేనిని కూల్చాలన్నా, ధ్వంసం చేయాలన్నా రిమోట్ కంట్రోల్ సీఎం జగన్ చేతిలోనే. వైసిపి ప్రభుత్వంలో పైలెట్ తప్ప కో పైలెట్ లేరు. కాబట్టి జరిగేవాటి అన్నింటికీ ఆ పైలెట్(జగన్)దే బాధ్యత.క్యాంటిన్ల ద్వారా చంద్రబాబుకే క్రెడిట్ వస్తుందనే అక్కసుతో మూసేశారు. మానవ హక్కుల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం'' అని అన్నారు. 

''ప్రతిపక్షంగా వైసిపి తప్పుడు వార్తలతో టిడిపిపై దుష్ప్రచారం చేసింది... అధికారంలోకి వచ్చాక  తప్పుడు సమాచారంతో ప్రజలనే కాదు, వ్యవస్థలను కూడా వైసిపి మోసగిస్తోంది'' అని యనమల మండిపడ్డారు. 

read more  కారులో నోట్లకట్టలు.. జగన్ కి ఆ దమ్ముందా లోకేష్ విమర్శలు

''దళిత న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండిస్తున్నాం. వైసిపి పాలనలో దళితులకు భద్రత లేదనడానికి ఇదే మరో సాక్ష్యం. జడ్జి రామకృష్ణపై దాడి వెనుక చిత్తూరు వైసిపి నేతల హస్తం ఉంది. అందుకే కేసు కట్టకుండా దళిత జడ్జిని వేధిస్తున్నారు. న్యాయమూర్తిపై దాడి, సాక్షాత్తూ న్యాయవ్యవస్థ పైనే దాడి. ఏపిలో జడ్జికే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుడికి భద్రత ఎక్కడ..? ఈ దుర్ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''రాజకీయ నిరుద్యోగుల కోసమే శాండ్ కార్పోరేషన్. దానివల్ల ప్రజలకు, పేదలకు ఒరిగేది శూన్యం. ఇప్పటికే మైనింగ్ కార్పోరేషన్ ఉండగా మళ్లీ శాండ్ కార్పోరేషన్ ఔచిత్యం ఏమిటి..? ఉన్న కార్పోరేషన్లకే నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు. బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ కార్పోరేషన్లకు తూట్లు పొడిచారు. నిర్వీర్యమైన కార్పోరేషన్ల జాబితాలో కొత్తగా శాండ్ కార్పోరేషన్ నిష్ఫలమే'' అని అన్నారు. 

''ఇసుక దోపిడిని వైసిపి ప్రభుత్వం అరికట్టలేక పోయింది. మైనింగ్ మాఫియాకు వైసిపి నేతలే నాయకత్వం. ప్రభుత్వం చేయలేని పని కార్పోరేషన్ ఎలా చేస్తుంది..? వైసిపి శాండ్ మాఫియాకు శాండ్ కార్పోరేషన్ పగ్గాలిచ్చి వాళ్ల దోపిడీకి అధికార ముద్ర కోసమే ఈ తాపత్రయం అంతా. ముందు ఇసుక అందుబాటు పెంచండి, ఉపాధి కోల్పోయిన 40లక్షల భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి. అది చేతగాక కార్పోరేషన్ ముసుగులో వైసిపి మాఫియాకు అధికార ముద్ర వేయవద్దు'' అని అన్నారు. 

''కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టిడిపి కట్టిన 8లక్షల ఇళ్లు పేదల స్వాధీనం చేయలేదు. 14నెలలైనా వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వక పోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. కట్టిన ఇళ్లు పంపిణీ చేయకుండా ఇళ్లపట్టాల హడావుడి గర్హనీయం. తక్షణమే నిర్మాణం పూర్తయిన లక్షలాది ఇళ్లను పేదలకు వెంటనే స్వాధీన పర్చాలి'' అని 
యనమల డిమాండ్ చేశారు. 
 

click me!