ఏపీ భవిష్యత్ పై ఆర్థిక విశ్లేషకులు ఏమంటున్నారంటే..: మాజీ ఆర్థికమంత్రి హెచ్చరిక

By Arun Kumar PFirst Published Aug 4, 2020, 6:55 PM IST
Highlights

ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ నాయకులు భయపడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 

గుంటూరు: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల్లో గెలిచి రాజధాని మార్చండని చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ని స్వీకరించడానికి వైసిపి నాయకులు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ ఎందుకు ముందుకు రావడం లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. 

''సీఎం జగన్ అభివృద్ది విధానాన్ని కాక విధ్వంసక విధానాన్ని అమలుపరుస్తున్నారు. మొత్తం సమగ్రాభివృద్ధిని నాశనం చేసి అమరావతిని అభివృద్ది చేస్తాం అనే వైసీపీ వాదన అర్దం లేనిది. రాజధాని అంశం ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన అంశం కాదు. ఇది మొత్తం రాష్ట్రానికి, ప్రజలకు సంబంధించింది. మూడు రాజధానుల అంశం చిన్నదిగా చేసి చూస్తే మొత్తం రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతోంది'' అన్నారు. 

''జగన్ ఒక ఏడాది పాలనలో రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చారు. దీనికి తోడు కరోనా మహమ్మారి అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. గడచిన రోజుల కంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇది ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషించి చెబుతున్న అంచనా. మన చేతుల్లో లేని న్యాయ రాజధానిని కర్నూలుకు తీసుకొస్తానని చెబుతూ రాయలసీమ వాసులను జగన్ మోసం చేస్తున్నాడు'' అని ఆరోపించారు. 

read more   అమరావతిపై నాడు-నేడు...జగన్ తో సహా వైసిపి నేతలు ఏమన్నారంటే: అయ్యన్న

''ఒకసారి రాజధానిని మార్చిన తర్వాత అమరావతిని అభివృద్ది చేస్తానని చెబుతున్న జగన్ మాట ఏవిధంగా సాధ్యపడుతుంది? ప్రశాంతంగా గతంలోనే అభివృద్ది చెందిన విశాఖను కూడా అభివృద్ది చేస్తామని చెబుతున్నారు. పెట్టుబడులు విశాఖ నుండి తరలిపోయిన తర్వాత ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది. కాబట్టి మూడు ముక్కల రాజధాని విధానం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడమే'' అని మండిపడ్డారు. 

''రాజధాని అంశం మొత్తం రాష్ట్రానికి సంబందించినది. జగన్ విధ్వంసక విధానం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్, దౌలతాబాడ్ నుండి ఢిల్లీకి మార్చినప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయ్యి పెద్ద ఆర్థిక విపత్తును ఎదుర్కొని చివరకు సామ్రాజ్యమే పతనమైపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రాన్ని కాపాడుకోక పోతే రాష్ట్రానికి తుగ్లక్ సామ్రాజ్యానికి పట్టిన గతే పడుతుంది. రాష్ట్రం అంధకారమవుతుంది'' అని యనమల విమర్శించారు.  

click me!