అమరావతిపై నాడు-నేడు...జగన్ తో సహా వైసిపి నేతలు ఏమన్నారంటే: అయ్యన్న (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 4, 2020, 6:27 PM IST
Highlights

 ఏపీలో వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని... తుగ్లక్ పాలనకు మించిన పాలన రాష్ట్రంలో సాగుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 

విశాఖపట్నం: ఏపీలో వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని... తుగ్లక్ పాలనకు మించిన పాలన రాష్ట్రంలో సాగుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దోపిడీ ఏవిధంగా జరుగుతోందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని విషయంపై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని... మూడు రాజధానుల నిర్ణయం జగన్ ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి? అని అయ్యన్న నిలదీశారు. 

''ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు? రాజధానుల నిర్ణయంపై ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. 2014, సెప్టెంబర్ 4న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 'విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. విభజనతో మన రాష్ట్రం చిన్నదైంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక మేము స్వాగతిస్తున్నాం. రాజధాని పెట్టే చోట కనీసం 30 వేల ఎకరాలైనా ఉండాలని' అన్నారు'' అని అయ్యన్న గుర్తుచేశారు. 

వీడియో

"

''ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలోనే రాజధాని ఉంటుందని వైసీపీ మేనిఫెస్టో అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పింది వాస్తవం కాదా? ఆ మాట మేనిఫెస్టోలో పెట్టారు కదా. ఆ సంగతి మర్చిపోయారా? రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎన్నికల ప్రచారంలో వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలోనే ఉంటుంది, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులం కాదు అని బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలు మర్చిపోయారా?'' అని ప్రశ్నించారు. 

read more   ఏపీ హైకోర్టులో జగన్‌కి ఎదురుదెబ్బ: మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై స్టేటస్ కో

''గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని 2014లో ధర్మాన ప్రసాద్ చెప్పింది వాస్తవం కాదా? రాజధాని మారుస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని 7.4.2018లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పింది వాస్తవం కాదా? వైసీపీ అధికారంలో వస్తే అమరావతిలోనే రాజధాని ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 16.12.2018లో చెప్పింది వాస్తవం కాదా? రాజధాని కట్టగల సమర్థుడు జగన్, అమరావతిలో ఆయన ఇల్లు కట్టుకుంటున్నారని రోజా చెప్పింది'' అంటూ తేదీలతో సహా వెల్లడించారు అయ్యన్న. 

''ఉన్నపణంగా రాజధాని మార్చాలని, రైతుల పొట్ట కొట్టాలని ఎందుకు చూస్తున్నారండి. గెలిస్తే ఏం చేస్తామో మేనిఫెస్టోలో చెబుతాం. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పలేదా? మాట తప్పను, మడమ తిప్పనని గొప్పలు చెప్పిన జగన్ ఎందుకిలా చేస్తున్నట్టు? భూములు దోచుకునేందుకు విశాఖను ఎంచుకున్నారా? ఎన్నికల ప్రచారంలో అమరావతే రాజధాని అని ప్రజల్ని నమ్మించి ఇప్పుడు మోసం చేయడం ఎంతవరకు సమంజసం..'' అని అడిగారు. 

''చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ కు వైసీపీ సిద్ధమా? ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ భయపడుతోంది. వైసీపీ నేతలకు దమ్మూ, ధైర్యం, పౌరుషం ఉంటే రాజధాని నిర్ణయంపై ప్రజాతీర్పుకు వెళ్లాలి. ప్రజలు ఇచ్చే తీర్పుకు అందరం కట్టుబడి ఉందాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా మనం ఉండాలి. తప్పు మీరు చేసి మమ్మల్ని రాజీనామా చేయమంటారేంటి బొత్స గారూ? చంద్రబాబు సవాల్ కు వైసీపీ ఆమోదం తెలపాలి'' అని యనమల సూచించారు. 

 
    

click me!