భారీగా పెరిగిన వైసిపి నడిమంత్రపు సిరి... కారణమదే: యనమల రామకృష్ణుడు

By Arun Kumar PFirst Published Jul 12, 2020, 1:23 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వైసిపి రాక్షస మాయ కమ్మేసిందని... సీఎం జగన్ పథకాలన్నీ మాయపేలాలే అని మాజీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు  అన్నారు.

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వైసిపి రాక్షస మాయ కమ్మేసిందని... సీఎం జగన్ పథకాలన్నీ మాయపేలాలే అని మాజీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు  అన్నారు. అయితే  ఏడాదిలోనే జగన్మాయ నుంచి జనం బైటపడ్డారని పేర్కొన్నారు. మాయ పథకాలతో పేదలను జగన్ వంచించారని  యనమల మండిపడ్డారు. 

''గత టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న పథకాలన్నీపేదరికంపై గెలుపు కోసమయితే... టిడిపి స్కీమ్ లు రద్దుచేసి జగన్ తెచ్చింది మాయపథకాలే. రద్దులు-పేర్ల మార్పుతో జగన్ మాయాజాలం చేస్తున్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటి సంక్షేమంలో సగానికి సగం కోత పెట్టారు. టిడిపి 2018-19లో రూ 6,149కోట్లు వ్యయం చేస్తే, వైసిపి 2019-20లో రూ3,382కోట్లకు తగ్గించింది.  టిడిపి ప్రభుత్వమే రూ2,767కోట్లు ఎక్కువగా ఖర్చు చేయడం బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటి సంక్షేమంపై చిత్తశుద్దికి రుజువు'' అని వెల్లడించారు. 

''సబ్ ప్లాన్ నిధుల వ్యయంలో వైసిపి గణనీయంగా కోతలు పెట్టడమే  కాదు కేటాయించిన కొద్దిపాటి సొమ్మును దారిమళ్లించింది. పాత పథకాలను నవరత్నాలలో కలిపేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతు భరోసాలో కలిపినట్లుగానే, అమ్మఒడిలో ఇంకొన్ని పథకాలను కలిపేశారు. పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పండుగ కానుకలు, పెళ్ళికానుకలు, విదేశీ విద్య, చంద్రన్న బీమా తదితర పథకాలను రద్దు చేశారు. కళాకారుల పించన్లు, డప్పు ఆర్టిస్టుల పించన్లు, ఎయిడ్స్ రోగుల పించన్లను తొలగించారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర పథకాల్లో కలిపేశారు. పాత పథకాలకు ముందు వైఎస్సార్ పేరు చేర్చి, కొత్త పథకాలుగా నమ్మించి మోసం చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

read more  మాస్కు ధరించనందుకు కుటుంబంపై కర్రలతో దాడి... యువతి మృతి

''14నెలల్లో రూ18,026కోట్ల విలువైన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. స్థానిక సంస్థలలో బీసిల రిజర్వేషన్లను 10% కోత పెట్టారు. 34% నుంచి 24%కు తగ్గించేశారు. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువ కోత పెట్టారు. దీనితో బీసిలు 1600 గ్రామాల్లో, 66మండలాల్లో, 300వార్డులలో, 11పట్టణాల్లో వేల సంఖ్యలో రాజకీయ పదవులను కోల్పోయారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తో అనవసరపు వివాదం కొనితెచ్చి స్థానిక ఎన్నికలు జరగకుండా చేసి, బలహీన వర్గాల నాయకత్వాన్ని ఎదిగిరాకుండా కుట్రలు పన్నారు'' అని  అన్నారు. 

''బెదిరింపులతో పరిశ్రమల్లో పెట్టుబడులు వెనక్కి తరిమేశారు. పారిశ్రామిక అభివృద్ది కుంటుపడి పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి. చదువుకున్న యువతలో నిరుద్యోగిత 23%కు పెరిగిపోయింది. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయడానికి, తొలగించడానికి చేసిన దుబారా ఖర్చు రూ2వేల కోట్లు బలహీన వర్గాల సంక్షేమంపై పెట్టినా ప్రయోజనం ఉండేది'' అని పేర్కొన్నారు. 

''నవశకం పేరుతో 18లక్షల రేషన్ కార్డులను, 6లక్షల పించన్లను తొలగించారు. ఎన్టీఆర్ వైద్యసేవ, సిఎంఆర్ఎఫ్ లబ్దిని పేదలకు దూరం చేశారు. సాంఘిక సంక్షేమం నిధులను రూ 6,407కోట్లనుంచి రూ5,919కోట్లకు తగ్గించారు. ఎస్సీ,ఎస్టీ సంక్షేమంలో 7.63% నిధులు కోతపెట్టారు. మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమ నిధుల్లో 10.59% కోత పెట్టారు.  టిడిపి ప్రభుత్వం 2018-19లో రూ3,007కోట్లు పెడితే, వైసిపి వచ్చాక 2019-20లో రూ2,689కోట్లకు తగ్గించారు. రూ318కోట్లు కోతపెట్టారు'' అని  వెల్లడించారు. 

''యువజన సంక్షేమ బడ్జెట్ ను ఏకంగా 70% కోత పెట్టారు. రూ 2,063 కోట్ల నుంచి రూ604కోట్లకు తగ్గించారు. నాలుగింట మూడొంతులు బడ్జెట్ కోత పెట్టి యువతను దారుణంగా
 మోసగించారు. మానవాభివృద్ది సూచికల్లో ఇప్పటికే మనరాష్ట్రం 27వ స్థానానికి దిగజారింది.  చేతగాని పాలన వల్లే తలసరి ఆదాయం క్షీణించింది. ఇసుక కొరతతో 40లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కరోనా లాక్ డౌన్ లతో అన్నివర్గాల ఆదాయానికి గండిపడింది. టిడిపి హయాంలో రెండంకల వృద్దిరేటు ప్రస్తుతం సింగిల్ డిజిట్ కు పడిపోయింది. కన్జ్యూమర్ ప్రెస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 6.5% వల్ల బలహీనవర్గాల కొనుగోలు శక్తి క్షీణించింది, పొదుపు శక్తి పతనమైంది'' అని గణాంకాలు వెల్లడించారు. 

''గత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తర్వాత ప్రభుత్వాలు స్వస్తి చెప్పరాదు. అదే జరిగితే బలహీన వర్గాల సంక్షేమానికి తూట్లు పొడిచినట్లే. కావాలంటే కొత్త పథకాలు ఎన్నైనా ప్రవేశపెట్టుకోవచ్చు గాని పాత ప్రభుత్వ పథకాలను రద్దు చేయరాదు. పేదల వ్యక్తిగత స్వావలంబనకు సంక్షేమ రంగమే కీలకం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఆర్ధిక స్వావలంబన. ఆర్ధిక స్వేచ్ఛ లేకపోతే ఇతరుల దయాదాక్షిణ్యాలపైనే వ్యక్తి జీవనం ఉంటుంది. వాళ్ల హక్కులను యజమాని వద్ద తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో బలహీనవర్గాల భాగస్వామ్యం క్షీణిస్తుంది.  800ఏళ్ల క్రితం మాగ్నాకార్టా చెప్పిందే ఇప్పుడు నిజమైంది. వైసిపి నాయకులే దీనికి బాధ్యత వహించాలి'' అని 
యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 

click me!