తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని చెప్పారు. నిజమైన తప్పులు చేసినవారే చంద్రబాబును కేసులో ఇరికించారని ఆరోపించారు. రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలతో పాటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వారు చంద్రబాబుతో మాట్లాడారు.
చంద్రబాబుతో ములాఖత్ అనంతరం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ.. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. చంద్రబాబు చేసిన కార్యక్రమాల వల్లే రాష్ట్ర అభివృద్ది జరిగిందని చెప్పారు. టీడీపీ చేసిన అభివద్దిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారని యనమల తెలిపారు. చంద్రబాబు పార్టీ కార్యకర్తల గురించి అడిగారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ను పలువురు జాతీయ నాయకులు ఖండించారని.. సంఘీభావం తెలిపిన నేతలకు కృతజ్ఞతలు చెప్పమన్నారని తెలిపారు. జైలులో చంద్రబాబుకు సరైన సౌకర్యాలు లేవని అన్నారు. చంద్రబాబు గదిలో ఏసీ లేదని అన్నారు. ఏసీ గురించి అడిగితే.. నిబంధనల ప్రకారం ఏసీ ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పినట్టుగా తెలిపారు. చంద్రబాబు గదిలో దోమలు ఉన్నాయని.. మూడు రోజుల తర్వాత దోమ ఇచ్చారని చెప్పారు. శాసనసభకు సమావేశాలకు హాజరవుతామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించినట్టుగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.