
తమిళనాడులో చిన్నమ్మ, స్టాలిన్ కలుస్తారా? దశాబ్దాల పాటు ఏఐఏడిఎంకె-డిఎంకె మధ్య ఉప్పు-నిప్పుగా సాగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనను తొలగించాలంటే రెండు పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరాన్ని ఇరువైపుల నేతలు గుర్తించినట్లు సమాచారం. తాను సిఎంగా బాధ్యతలు తీసుకోవటమన్నది దాదాపు సాధ్యం కాదన్నవిషయం శశికళకు అర్ధమైపోయింది. తనను సిఎంగా కాకుండా అడ్డుకున్న పన్నీర్ ను తాను కూడా అడ్డుకోవాలంటే అందుబాటులో ఉన్న మార్గాల గురించి చిన్నమ్మ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తన క్యాంపులోని ఎంఎల్ఏలు పన్నీర్ వైపు జారిపోకుండా శశికళ ఎక్కువ రోజులు అడ్డుకోలేరన్నది వాస్తవం. తాను సిఎంగా బాధ్యతలు తీసుకోకుండా పన్నీర్ కేంద్రం సాయంతో ఇప్పటికైతే అడ్డుకోగలిగారు. కేంద్రాన్ని శశికళ ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఉన్నారు. అదే పన్నీర్ ను దెబ్బ కొట్టాలనుకుంటే శశికళను కేంద్రం అడ్డుకోలేందు. పన్నీర్ ను అడ్డుకోవాలంటే డిఎంకెతో చేతులు కలపటమొకటే దారి. ప్రభుత్వ ఏర్పాటులో పన్నీర్ కు తమ మద్దతుంటుందని స్టాలిన్ ప్రకటించారు. అయినా ఇప్పటి వరకూ పన్నర్ కు చాలినంత మద్దతు లభించ లేదు. అంటే, ఇప్పటికీ మెజారిటీ ఎంఎల్ఏల మద్దతు శశికళకే ఉందన్న విషయం అర్ధమైపోయింది.
ఇక్కడే స్టాలిన్ లో కూడా పునరాలోచన మొదలైనట్లు సమాచారం. ఓవైపు కేంద్రం మద్దతు, ఇంకో వైపు డిఎంకె మద్దతు ఇస్తున్న పన్నీర్ పుంజుకోలేకపోతున్నారు. ఈ పరిస్ధితుల్లో పన్నీర్ వైపు చూడటం కన్నా శశికళతో చేతులు కలిపితే ఒక్క రోజులోనే స్టాలిన్ సిఎం అయిపోతారుకదా అన్న ఆలోచన డిఎంకె శిభిరంలో మొదలైంది. ‘శతృవుకు శతృవు మితృడ’న్న రాజనీతి ఉండనే ఉన్నది కాబట్టి రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విరోధులు సైతం చేతులు కలిపారన్న మంచి పేరును కూడా ప్రజల్లో కొట్టేయవచ్చన్నది ఇరు పార్టీల్లోని నేతల యోచనగా తెలుస్తోంది. మరి నిజంగానే శశికళ, స్టాలిన్ చేతులు కలిపితే గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.